Telugu Global
Telangana

గవర్నర్‌ను సెక్రటేరియట్ ప్రారంభానికి పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: మంత్రి హరీశ్ రావు

వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఎన్నో సార్లు ప్రారంభించినా రాష్ట్రపతికి ఆహ్వానమే లేదు. ఆ విషయాన్ని మేం అడిగామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

గవర్నర్‌ను సెక్రటేరియట్ ప్రారంభానికి పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: మంత్రి హరీశ్ రావు
X

కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు పిలుపు అందలేదని.. ఆహ్వానిస్తే తప్పకుండా హజరయ్యేదాన్ని అని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా, మహిళగా తమిళిసై సౌందర్ రాజన్‌ను గౌరవిస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సచివాలయం ప్రారంభించాలంటే గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో రాసుందా అని ఆయన ప్రశ్నించారు. వందే భారత్ రైలును ప్రారంభించే సమయంలో రాష్ట్రపతిని పిలిచారా? వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఎన్నో సార్లు ప్రారంభించినా రాష్ట్రపతికి ఆహ్వానమే లేదు. ఆ విషయాన్ని మేం అడిగామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి ఎంతో బాధ కలిగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆమె ప్రవర్తన ఉందని హరీశ్ రావు అన్నారు. చిన్న చిన్న సాకులు చూపించి ఎన్నో బిల్లులను ఆమె పెండింగ్‌లో పెట్టారని.. సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక లేదని మంత్రి హరీశ్ వాపోయారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేరనే కారణంతో.. వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయస్సు పెంచుతూ బిల్ పాస్ చేస్తే.. రాజ్‌భవన్‌లో ఏడు నెలల పాటు ఆపారని హరీశ్ రావు మండిపడ్డారు.

ఆ బిల్లులను ఏడు నెలల పాటు తన వద్దే ఉంచుకొని.. చివరకు ఆమోదం తెలపకుండానే తిప్పి పంపడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇలా ప్రతీ విషయంలో అడ్డుపడుతున్న రాజ్‌భవన్‌కు మేమెందుకు వెళ్లాలి? అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుంటే ఎందుకు పిలవాలి : రెడ్‌కో చైర్మన్ సతీశ్ రెడ్డి

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయరని.. కానీ తెలంగాణ గవర్నర్ తమిళిసై అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రెడ్‌కో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోడీ ఎందుకు అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పాలన మెరుగుకు, ప్రజా సంక్షేమానికి, యువత భవిష్యత్ కోసం అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను నెలల తరబడి తొక్కిపెట్టిన గవర్నర్.. ఇప్పుడు ఇలా ప్రభుత్వం విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు.

గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం బాధకరం : మంత్రి గంగుల

అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని మంత్రి గంగుల కమలాకర్ హితవు పలికారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ గవర్నర్‌గా కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. రాజకీయ లబ్ది కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా కాకుండా.. చిత్త శుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ సైతం బాధ్యత తీసుకొని ఎఫ్‌సీఐ అధికారులను పిలిచి.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అలా చేయడం వల్ల రైతులకు మంచి జరుగుతుందని మంత్రి చెప్పారు.

First Published:  4 May 2023 1:04 PM GMT
Next Story