Telugu Global
Telangana

తెలంగాణ ఇంచార్జి డీజీపీగా అంజనీకుమార్

పదవీ విరమణ చేయనున్న డీజీపీ మహేందర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించే అవకాశం ఉన్నది.

తెలంగాణ ఇంచార్జి డీజీపీగా అంజనీకుమార్
X

తెలంగాణ ఇంచార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరామం చేయనున్నారు. 2018 ఏప్రిల్ నుంచి తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవీ విరమణ చేస్తుండటంతో ఇంచార్జి డీజీపీగా అంజనీకుమార్ ప్రస్తుతం యాంటీ కరప్షప్ బ్యూరో డీజీగా ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసీ డీజీపీగా నియమించడంతో మిగిలిన కొంత మంది ఐపీఎస్‌ల బదిలీలు కూడా చేయాల్సి వచ్చింది.

ఏసీబీ డీజీగా రవి గుప్తాను నియమించారు. ఇక రవిగుప్తా ఇప్పటి వరకు నిర్వహిస్తున్న హోం డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టుకు డాక్టర్ జితేందర్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన లా అండ్ ఆర్డర్ ఏడీజీపీగా ఉన్నారు. ఇక రాచకొండ కమిషనర్ మహేష్ మురళీ భగవత్‌ను సీఐడీ ఏడీజీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీపీగా సంజయ్ కుమార్ జైన్‌ను నియమించారు. ఆయన తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్‌కు డైరెక్టర్ జనరల్‌గా కూడా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.

మహేందర్ రెడ్డి రిటైర్ కానుండటంతో పూర్తి స్థాయి డీజీపీ కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లు యూపీఎస్సీకి పంపించారు. వారిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ షార్ట్ లిస్ట్ చేసి ప్రభుత్వానికి పంపుతుంది. తెలంగాణ ప్రభుత్వం అంజనీకుమార్ (1990 బ్యాచ్), హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా (1990), సీవీ ఆనంద్ (1991), ఏడీజీపీ జితేందర్ (1992)తో పాటు రాజీవ్ రతన్ పేర్లను పంపించారు. అయితే షార్ట్ లిస్ట్ అయ్యే ముగ్గురిలో అంజనీ కుమార్ పేరు ఉంటుందనే నమ్మకంతో ఆయనకు ప్రస్తుతం ఇంచార్జి పదవి ఇచ్చింది. లిస్టు వచ్చిన తర్వాత అంజనీకుమార్‌నే పూర్తి స్థాయి డీజీపీగా నియమించే అకాశం ఉన్నది.

1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ స్వస్థలం బీహార్ లోని పాట్నా. ఆయన సెయింట్ జేవియర్ కాలేజ్ (పాట్నా) నుంచి డిగ్రీ, ఢిల్లీలోని కిరోరీమల్ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేశారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునే సమయంలో మహారాజా ఆఫ్ టాంక్ కప్ గెలిచి.. బెస్ట్ హార్స్ రైడర్‌గా నిలిచారు. అలాగే ఆర్డీ సింగ్ గెలిచి.. ఉత్తమ స్విమ్మర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న అంజనీకుమార్.. గతంలో హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా కూడా పని చేశారు. 1998లో యునైటెడ్ నేషన్స్ తరపున బోస్నియాలో పని చేశారు. ఆయనకు రెండు సార్లు యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్ లభించింది.

పదవీ విరమణ చేయనున్న డీజీపీ మహేందర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించే అవకాశం ఉన్నది. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చైర్మన్ పదవిని క్రియేట్ చేసింది. ఈ సీసీసీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పదవిలో ఉన్న వారికి కేబినెట్ హోదా లభిస్తుంది. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేస్తుందని సమాచారం.




First Published:  29 Dec 2022 12:47 PM GMT
Next Story