Telugu Global
Telangana

ఐఫోన్ల తయారీ హైదరాబాద్‌లోనే.. రేపు భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్

సోమవారం ఫాక్స్‌కాన్ యూనిట్‌కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.

ఐఫోన్ల తయారీ హైదరాబాద్‌లోనే.. రేపు భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్
X

ఐ ఫోన్లను మాన్యుఫ్యాక్చర్ చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ తమ కొత్త తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నది. ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణకు వచ్చిన ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ తయారీ యూనిట్‌కు సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లోనే ఫాక్స్‌కాన్ కంపెనీకి హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగరకలాన్‌లో భూమిని కేటాయించారు. ఈ మేరకు ఫాక్స్‌కాన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.

అమెరికా టెక్నాలజీ కంపెనీ అయిన ఆపిల్‌కు సంబంధించిన ఉత్పత్తులను తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు తైవాన్, చైనా దేశాల్లో వారికి తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే తొలి సారిగా ఐ ఫోన్‌ల ఉత్పత్తిని ఇండియాకు తరలించాలని కంపెనీ భావించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లోని స్థలం తమకు అనుకూలంగా ఉందని చెప్పి.. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. రూ.1,656 కోట్లతో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు.

కాగా.. సోమవారం ఫాక్స్‌కాన్ యూనిట్‌కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఆదివారం ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో పాటు టీఎస్ఐఐసీ అధికారులు కొంగరకలాన్‌లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వారికి కార్యక్రమానికి సంబంధించిన విషయాలను కూలంకషంగా వివరించారు.

ఫాక్స్‌కాన్ కంపెనీ తమ ఫెసిలిటీని ప్రారంభించిన తర్వాత దాదాపు 35 వేల మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కోరిన వెంటనే ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇక్కడి వసతులు బాగున్నాయని కంపెనీ అధికారులు అన్నారు. గతంలో ఫాక్స్‌కాన్ కోరినట్లుగానే 196 ఎకరాల స్థలాన్ని ఫాక్స్‌కాన్‌కు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.


First Published:  14 May 2023 2:10 PM GMT
Next Story