Telugu Global
Telangana

జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ నుంచి ఆహ్వానం.. తారక్ వెళ్తారా? లేదా? అనే విషయంపై చర్చ

హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కావాలని టీడీపీ నుంచి తారక్‌కు ఆహ్వానం అందింది. కైతలాపూర్‌లో ఈ నెల 20న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగనున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ నుంచి ఆహ్వానం.. తారక్ వెళ్తారా? లేదా? అనే విషయంపై చర్చ
X

జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో తాత స్థాపించిన టీడీపీ కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు వ్యవహార శైలితో ఆయన పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు దూరం అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీలో, చంద్రబాబు వల్ల జరిగిన అవమానాలను ఏపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు పలు మార్లు మీడియాలో వెల్లడించారు. అయితే, ఆ విషయాలను జూనియర్ ఎన్టీఆర్ ఏనాడూ ఖండించలేదు. వారి అభిప్రాయాలను సమర్థించనూ లేదు.

ఇక టీడీపీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విజయవాడలో కూడా ఉత్సావాలు నిర్వహించారు. దానికి రజనీకాంత్‌ను ముఖ్య అతిథిగా పిలిచినా.. తారక్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కావాలని టీడీపీ నుంచి తారక్‌కు ఆహ్వానం అందింది. కైతలాపూర్‌లో ఈ నెల 20న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగనున్నాయి.

ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ఇవాళ తారక్‌ను నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ సావనీర్ కమిటీ చైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్థన్ కలిసి ఆహ్వానించారు. కాగా, ఈ ఆహ్వానంపై పార్టీ కార్యకర్తలు, జూనియర్ అభిమానుల్లో చర్చ జరుగుతున్నది. తాతయ్య శత జయంతి వేడుకలకు హాజరవడం మంచిదే.. కానీ ఆ కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతుండటంతో తారక్ పాల్గొనడం ఇష్టం లేదని కొందరు అభిమానులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి పిలవకుండా.. ఇప్పుడు పిలవడమేంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.

కైతలాపూర్ ఉత్సవాలకు తారక్‌తో పాటు కల్యాణ్‌రామ్, దగ్గుబాటి పురందరేశ్వరి, నందమూరి కుటుంబం మొత్తానికి కమిటీ ఆహ్వానాలు పంపింది. ఇక మే 28న ఎన్టీఆర్ జయంతి రోజు లక్ష మందితో టీడీపీ మహానాడు నిర్వహించనున్నది. ఆ రోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలు భారీగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి తారక్ హాజరవుతారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

First Published:  15 May 2023 10:46 AM GMT
Next Story