Telugu Global
Telangana

2022లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ‌

2022 సంవత్సరం లో తెల‍ంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల నుండి , చిన్న కంపెనీల దాకా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు పెట్టుబడి దారులు. వచ్చే సంవత్సరం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి.

Investments will flood Telangana in 2022
X

2022లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ‌

2022 సంవత్సరం లో తెల‍ంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల నుండి , చిన్న కంపెనీల దాకా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు పెట్టుబడి దారులు. వచ్చే సంవత్సరం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి.

2022లో ఏరోస్పేస్, డెయిరీ, ఐటి, ఫార్మా, ఆటోమొబైల్ తో సహా అనేక ఇతర రంగాల్లో ప్రధాన కార్పొరేట్ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణకు రూ.19,630 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 70,000 మందికి పైగా కొత్తగా ఉపాధి పొందారు.

ఈ పెట్టుబడులతో పాటు రూ.1,11,000 కోట్ల పెట్టుబడుల ప్రకటనలు వెలువడ్డాయి.ఈ పెట్టుబడులన్నీ వచ్చే రెండు మూడు సంవత్సరాలలో గ్రౌండింగ్ చేయబడ్తాయి. దీని వల్ల 63,000 మందికి పైగా కొత్తగా ఉపాధి పొందుతారు. తెలంగాణ డైనమిక్, పారిశ్రామిక అనుకూల విధానం వల్లనే రాష్ట్రంలోకి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.

ఇతర శాఖలతో సంబంధం లేకుండా TS-iPASS ద్వారా అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణాన్ని సృష్టించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ను కార్పొరేట్ దిగ్గజాలు, స్టార్టప్ల యాజమాన్యాలు ప్రశంసిస్తున్నాయి.

ఈ సంవత్సరం ప్రకటించిన ప్రధాన పెట్టుబడులు: ఫార్చ్యూన్-500 కంపెనీ అయిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) రూ. 24,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అత్యంత అధునాతన AMOLED డిస్‌ప్లేలను తయారు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే FABని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారతదేశంలో ముంబై తర్వాత దాని రెండవ AWS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీజియన్, AWS ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

అమెజాన్ 2030 నాటికి సుమారు రూ. 36,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సంవత్సరానికి 48,000 కంటే ఎక్కువ మందికి కొత్తగా ఉద్యోగాలొస్తాయి.

ఐటీ రంగం

హైదరాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది.

ఈ కొత్త డేటా సెంటర్, డెవలపర్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్య, స్టార్టప్ లు, ఎంటర్‌ప్రైజ్‌లకు సహాయం చేయడానికి అధునాతన డేటా భద్రత, క్లౌడ్ సొల్యూషన్‌లు, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ (CRM), ఉత్పాదకత సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిస్తుంది.

అమెరికన్ బహుళజాతి సంస్థ — Qualcomm — యునైటెడ్ స్టేట్స్ వెలుపల దాని రెండవ అతిపెద్ద క్యాంపస్‌ను అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభించింది.

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.3,904.55 కోట్లు పెట్టుబడి పెడుతోంది. గూగుల్ తన 3.3 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యం గల‌ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.

ఏరోస్పేస్, రైలు

ఐటీ రంగమే కాకుండా ఏరోస్పేస్ రంగంలోని ఇండస్ట్రీ దిగ్గజాలు కూడా తమ యూనిట్లను నెలకొల్పేందుకు ఈ ఏడాది హైదరాబాద్‌లో అడుగుపెట్టాయి.

ఫ్రెంచ్ మేజర్ సఫ్రాన్ హైదరాబాద్లో 1,200 కోట్ల పెట్టుబడితో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల కోసం MRO (నిర్వహణ, మరమ్మత్తు ఓవర్‌హాల్ సౌకర్యం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 1,000 ఉన్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను కల్పించనున్నారు..

పరిశ్రమల మంత్రి కేటీఆర్ సఫ్రాన్ ఎలక్ట్రికల్ & పవర్ ఫ్యాక్టరీలను ప్రారంభించారు, ఇది ఇంజిన్ వైర్ హార్నెస్‌లను ఉత్పత్తి చేస్తుంది. LEAP ఇంజిన్‌ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజిన్ భాగాలను తయారు చేసే ఈ కంపెనీ హైదరాబాద్ లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫ్యాక్టరీని ప్రారంభించింది.

స్టాడ్లర్ రైల్ తన రైల్ కోచ్ తయారీ కేంద్రాన్ని రూ. 1,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ 2,500 ఉద్యోగాలను కల్పిస్తుంది..

బ్యాటరీ కంపెనీలు

తెలంగాణలో తమ యూనిట్లను నెలకొల్పేందుకు బ్యాటరీ తయారీ కంపెనీలు వరుస కడుతున్నాయి. లి బ్యాటరీలు, సెల్‌ల తయారీకి రూ.660 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆగర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.

అదే విధంగా, అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ మహబూబ్‌నగర్‌లో 10 సంవత్సరాల కాలంలో 16 GWh సామర్థ్యం గల లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 GWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ ప్రణాళికలను ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో యూనిట్‌ ఏర్పాటు చేసి దాదాపు 4,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.

ఆటోమొబైల్ రంగం

తెలంగాణ ఇప్పుడు ఆటోమొబైల్ రంగానికి కూడా హబ్‌గా మారుతోంది. ఈ సంవత్సరం, ప్రతిపాదిత తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో టెస్ట్ ట్రాక్‌ల ఏర్పాటు కోసం హ్యుందాయ్ రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

జహీరాబాద్ లో మహీంద్రా కంపెనీ తాజాగా తన‌ 3,00,000వ ట్రాక్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ: "మహీంద్రా గ్రూప్ జహీరాబాద్ యూనిట్ తన 3,00,000 ట్రాక్టర్ ను విడుదల చేయడం తెలంగాణకు గర్వ కారణం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ట్రాక్టర్ ఉత్పత్తిలో మహీంద్రా తదుపరి మైలురాయికి చేరుకోవాలని మేము ఎదురుచూస్తున్నాము.'' అన్నారు.

MRF ఇండియా విస్తరణలో భాగంగా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది.

కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ ఏటా 2,40,000 ఈవీలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో తెలంగాణలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రాహుల్ గయామ్ నేతృత్వంలో తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న‌ బిలిటీ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ ఆధారిత గాయమ్ మోటార్ వర్క్స్ (GMW) భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే కొత్త ప్లాంట్ 3,000 ఉద్యోగాలను కల్పిస్తుంది..

డెయిరీ, ఫిషరీస్

దేశంలోనే డెయిరీ ఉత్ప్పత్తుల్లో దిగ్గజ కంపెనీ అయిన అమూల్ తెలంగాణలో ఒక అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది, ఇది మొదటి దశలో రూ. 300 కోట్లు, రెండవ దశలో రూ. 200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ప్లాంట్ రోజుకు 5 లక్షల లీటర్ల పాలను (LLPD) ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది,

ప్రపంచంలోనే అతిపెద్ద చేపల దిగుమతిదారు, మేజర్ ఫిషింగ్ కంపెనీ ఆక్వాకల్చర్ తెలంగాణలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా కేజ్‌ కల్చర్‌ పద్ధతిలో ఏడాదికి 85,000 మెట్రిక్‌ టన్నుల తిలాపియా చేపలను ఉత్పత్తి చేస్తారు.ఈ కంపెనీ 3,000 మందికి ప్రత్యక్షంగా, 2,000 మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది.

First Published:  27 Dec 2022 7:39 AM GMT
Next Story