Telugu Global
Telangana

కొనసాగుతున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. మరో ఇద్దరి అరెస్ట్

తమ్ముడు రవికుమార్‌ కోసం ప్రశ్నపత్రం కొనేందుకు భగవంత్‌కుమార్‌ తన ఖాతా నుంచి రూ.1.75 లక్షలు బదిలీ చేయడంతో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కొనసాగుతున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. మరో ఇద్దరి అరెస్ట్
X

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి మురళీధర్‌, మనోహర్‌ రెడ్డిలు రూ.10లక్షలకు ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు.. వీరిని అరెస్ట్ చేశారు.

ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గండీడ్‌ మండలంలో ఇప్పటికే పేపర్‌ లీకేజీ ప్రధాన సూత్రధారి రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌, సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌, గోపాల్‌, నీలేష్‌, శ్రీనివాస్‌, తిరుపతయ్య, మైబయ్య, జనార్దన్‌లను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకొని వివరాలను సేకరించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈనెల 5వ తేదీన గండీడ్‌ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భగవంత్‌కుమార్‌, అతడి తమ్ముడు రవికుమార్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


భగవంత్‌కుమార్‌ వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలో ఉపాధిహామీ పథకం సాంకేతిక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రేణుక భర్త డాక్యా నాయక్‌ అతడికి సహోద్యోగి. తమ్ముడు రవికుమార్‌ కోసం ప్రశ్నపత్రం కొనేందుకు భగవంత్‌కుమార్‌ తన ఖాతా నుంచి రూ.1.75 లక్షలు బదిలీ చేయడంతో సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

డాక్యానాయక్‌ సొంతూరు గండీడ్‌ మండలం కాగా పనిచేసే ప్రాంతం వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం. దీంతో డాక్యానాయక్ ప్రశ్నపత్రం విక్రయించేందుకు ఈ రెండు మండలాల్లో పరిచయం ఉన్నవారితో బేరసారాలు చేసినట్లు తెలుస్తోంది. ఖాతాలద్వారా నగదు బదిలీ చేసిన వారినే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని, నేరుగా డబ్బులు ఇచ్చినవారి సంఖ్య చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  9 May 2023 1:30 AM GMT
Next Story