Telugu Global
Telangana

ఏప్రిల్ 10న ఆత్మహత్య.. ఈరోజు ఇంటర్ ఫలితాల్లో A గ్రేడ్

పరీక్షల్లో ఫెయిలయిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిని చూస్తున్నాం. కానీ మార్కులు తగ్గుతాయనే ఉద్దేశంతో ముందుగానే చనిపోయాడు కృష్ణ.

ఏప్రిల్ 10న ఆత్మహత్య.. ఈరోజు ఇంటర్ ఫలితాల్లో A గ్రేడ్
X

ఈరోజు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల విడుదల తర్వాత ఫెయిలైనవారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన అటు తల్లిదండ్రుల్లో, ఇటు అధికారుల్లోనూ ఉంది. ఇటీవల కాలంలో పరీక్షల్లో ఫెయిలై అఘాయిత్యాలు చేసుకున్న విద్యార్థుల ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నిటిలో ప్రత్యేకమైనది గగులోత కృష్ణ ఉదంతం. పరీక్షలు సరిగా రాయలేదనే బాధతో, మార్కులు తగ్గుతాయనే భయంతో ఏప్రిల్-10న గగులోతు కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థికి A గ్రేడ్ రావడం విశేషం.

మహబూబాబాద్‌ జిల్లా కె.సముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన గగులోతు కృష్ణ ఇంటర్‌ బైపీసీ విద్యార్థి. గత నెల పరీక్షలు రాసిన తర్వాత మార్కులు తగ్గుతాయని కృష్ణ మానసిక వేదనకు గురయ్యాడు. ఏప్రిల్-10న ఉరేసుకుని చనిపోయాడు. తాను సరిగా చదవలేకపోయానని, ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని, మార్కులు సరిగ్గా రావని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయాడు కృష్ణ.

ఈరోజు విడుదలైన ఫలితాలు చూస్తే కృష్ణకు A గ్రేడ్ వచ్చింది. 892/1000 మార్కులు సాధించాడు కృష్ణ. కొడుకు చనిపోయిన రోజు గుండెలు పగిలేలా రోదించిన తల్లిదండ్రులు.. ఈరోజు ఇంటర్లో అతడికి వచ్చిన మార్కుల్ని చూసి మరోసారి కన్నీరుమున్నీరయ్యారు. మార్కులు తగ్గుతాయనే ఉద్దేశంతో తమ కొడుకు చనిపోయాడని, తమకి కడుపుకోత మిగిల్చాడని అంటున్నారు తల్లిదండ్రులు. పరీక్షల్లో ఫెయిలయిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిని చూస్తున్నాం. కానీ మార్కులు తగ్గుతాయనే ఉద్దేశంతో ముందుగానే చనిపోయాడు కృష్ణ. కానీ చివరకు ఫలితాల్లో అతనికి A గ్రేడ్ వచ్చింది.

First Published:  9 May 2023 5:07 PM GMT
Next Story