Telugu Global
Telangana

బర్రెలక్క అలియాస్ శిరీష పోటీపై.. రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ

గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానంటూ చేసిన ఓ వీడియోతో శిరీషకు బర్రెలక్కగా పేరు స్థిరపడిపోయింది. ఇక ఈ ఎన్నికల్లో శిరీషకు విజిల్‌ - ఈల గుర్తు కేటాయించింది ఎలక్షన్ కమిషన్.

బర్రెలక్క అలియాస్ శిరీష పోటీపై.. రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ
X

కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండట‌మే. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష.. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు సవాల్ విసురుతోంది. నిరుద్యోగ అంశమే ప్రధాన అజెండాగా శిరీష ఎన్నికల బరిలో దిగారు.

గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానంటూ చేసిన ఓ వీడియోతో శిరీషకు బర్రెలక్కగా పేరు స్థిరపడిపోయింది. ఇక ఈ ఎన్నికల్లో శిరీషకు విజిల్‌ - ఈల గుర్తు కేటాయించింది ఎలక్షన్ కమిషన్. యూట్యూబ్‌లో బర్రెలక్క అలియాస్ శిరీష ఛానల్‌కు దాదాపు 1.6 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్‌లోనూ ఆమె వీడియోస్‌ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఏ రాజకీయ నాయకుడికి రానన్ని వ్యూస్ వస్తున్నాయి. శిరీషకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.


ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి సాహసం చేయడంపై శిరీషను అభినందిస్తున్నారు. యానాంకు చెందిన మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు సైతం ఆమెకు రూ.లక్ష సాయం ప్రకటించారు. ఇటీవల ప్రచారంలో భాగంగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయ పార్టీలకు అతీతంగా బర్రెలక్కకు మద్దతు ప్రకటించారు నేతలు. ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

శిరీష స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే కాదు.. మేనిఫెస్టోను సైతం ప్రకటించింది. కొల్లాపూర్‌లో హాస్పిటల్స్‌ ఏర్పాటుతో పాటు ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. తన పోటీ వెనుక ఎవరు లేరని.. తనకు తానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తోంది. ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయమని ధీమాగా చెప్తోంది బర్రెలక్క అలియాస్ శిరీష. అయితే శిరీష అలియాస్ బర్రెలక్క పోటీతో ఓట్లు చీలి ఎవరికి మేలు జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

First Published:  23 Nov 2023 6:37 AM GMT
Next Story