Telugu Global
Telangana

వామపక్షాల మద్దతుపై బీఆర్ఎస్ నేతల కీలక వ్యాఖ్యలు

మునుగోడు ఉప ఎన్నికల తర్వాత వామపక్షాలు ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ కి దూరమవుతున్నాయి. కర్నాటక ఫలితాల తర్వాత స్వరం మార్చడం కూడా వారి వ్యూహంలో భాగమే.

వామపక్షాల మద్దతుపై బీఆర్ఎస్ నేతల కీలక వ్యాఖ్యలు
X

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని తేలిపోయింది. బీఆర్ఎస్ కి పోటీగా కాంగ్రెస్, బీజేపీ.. తమ సత్తా చూపించాలనుకుంటున్నాయి. అయితే పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యేనంటూ కాంగ్రెస్ చెప్పుకుంటోంది. లేదు లేదు, బీజేపీ -బీఆర్ఎస్ మధ్యేనంటూ కమలదళం స్టేట్ మెంట్లిస్తోంది. అయితే ఈ దఫా తెలంగాణలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందా..? వామపక్షాలతో కలసి బరిలో దిగుతుందా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

ఆమధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి వామపక్షాలు మద్దతిచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ పనిచేశాయి. తమ మద్దతుదారుల ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పడేలా చేశాయి. అయితే ఆ తర్వాతే వ్యవహారం ఎక్కడో తేడా కొట్టింది. వామపక్ష నేతలు బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని నిష్టూరాలాడారు. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. ఈ దశలో ఇటీవల సీపీఐ నారాయణ, కాంగ్రెస్ విషయంలో చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత నారాయణ ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంలో తమకు మరో ఆప్షన్ ఉందన్నారు. కానీ తాము బీఆర్ఎస్ స్పందన కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.

వామపక్షాలు లేకుండానే..

సీపీఐ నారాయణ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ లోని కొందరు నేతలు తేలిగ్గా తీసిపారేశారు. వామపక్షాల మద్దతు లేకుండానే తాము రెండుసార్లు అధికారంలోకి వచ్చామని చెప్పారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లలో గెలుస్తుందని జోస్యం చెప్పారు. కర్నాటక ఫలితాలతో అయినా బీజేపీకి జ్ఞానోదయం కలగాలన్నారు. మతకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావాలనుకోవడం దుర్మార్గం అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోందని చెప్పారు గుత్తా. మెజార్టీ సీట్లు వచ్చినా సీఎం సీటు విషయంలో ఆ పార్టీ తేల్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.

వామపక్షాలు బీఆర్ఎస్ తో కలుస్తాయా..?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, వామపక్షాలు కలసి పోటీ చేస్తాయనే అంచనాలు ఇప్పుడు తలకిందులయ్యేలా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత వామపక్షాలు ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ కి దూరమవుతున్నాయి. కర్నాటక ఫలితాల తర్వాత స్వరం మార్చడం కూడా వారి వ్యూహంలో భాగమే. అయితే బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపైనే పొత్తుల లెక్కలు ఆధారపడి ఉన్నాయి.

First Published:  16 May 2023 10:21 AM GMT
Next Story