Telugu Global
Telangana

భట్టికి మళ్లీ అవమానం.. ఈసారి ఏమైందంటే..?

ప్రచారంలోనే పక్కనపెట్టారంటే, భట్టి కాన్వాయ్ లోని కారుని కూడా ఆపేయడం దానికి పరాకాష్ట అంటున్నారు. దీనిపై భట్టి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నుంచి మాత్రం ఎలాంటి వివరణ బయటకు రాలేదు.

భట్టికి మళ్లీ అవమానం.. ఈసారి ఏమైందంటే..?
X

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సంబంధించి వరుస సంఘటనలు సంచలనంగా మారుతున్నాయి. అవి యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయో తేలడంలేదు కానీ ప్రతిసారీ భట్టి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు, అన్ని అవమానాలు ఆయనకే ఎదురవుతున్నాయి. తాజాగా తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో సభ వద్దకు భట్టి కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. అంతే కాదు, ఆ వాహనం ఆపి డ్రైవర్ పై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ తో భట్టి వర్గం మరింతగా రగిలిపోతోంది.

అసలేం జరిగింది..?

తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు సభా ప్రాంగణం వద్దకు అనుమతించలేదు. సభలోకి వెళ్లేందుకు డయాస్‌ పాస్‌ ఉందని డ్రైవర్‌ చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. పైగా డ్రైవర్‌ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి చేయి చేసుకున్నారని తెలుస్తోంది. డ్రైవర్ జేబులోని ఐడీ కార్డును లాక్కొని, వాహనాన్ని నిలిపివేశారని అంటున్నారు. ఆ తర్వాత తిరిగి డ్రైవర్‌ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇంత జరిగినా ఆ వీడియోలు మాత్రం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. అయితే అక్కడ జరిగిన వ్యవహారం డ్రైవర్ ద్వారా బయటకు తెలిసింది. భట్టి వర్గం ఈ అవమానాన్ని తట్టుకోలేమంటూ రగిలిపోతోంది.

గతంలో కొన్ని ప్రభుత్వ ప్రకటనల్లో భట్టి ఫొటో మిస్ కావడం, ఆ తర్వాత యాదాద్రి క్షేత్రంలో చిన్నపీట అవమానం అందరికీ తెలిసిందే. తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్‌ జన జాతర సభ కోసం వార్తాపత్రికలకు ఇచ్చిన ప్రకటనలో కూడా భట్టిని ఓ మూలన పడేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన స్పేస్ కూడా డిప్యూటీ సీఎంగా భట్టికి లేకపోవడం విశేషం. ప్రచారంలోనే పక్కనపెట్టారంటే, భట్టి కాన్వాయ్ లోని కారుని కూడా ఆపేయడం దానికి పరాకాష్ట అంటున్నారు. దీనిపై భట్టి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నుంచి మాత్రం ఎలాంటి వివరణ బయటకు రాలేదు.

First Published:  7 April 2024 3:02 AM GMT
Next Story