Telugu Global
Telangana

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. పలు రంగాల్లో యువతకు ఉద్యోగావకాశాలు

మోండీ హోల్డింగ్స్ వ్యవస్థాపకులు, చైర్మన్, సీఈవో ప్రసాద్ గుండుమోగులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. పలు రంగాల్లో యువతకు ఉద్యోగావకాశాలు
X

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడంతో పాటు యువతకు మరిన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. కేటీఆర్ అండ్ టీమ్ ఇచ్చిన ప్రెజెంటేషన్స్‌లో ఇంప్రెస్ అయిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా మోండీ హోల్డింగ్స్ వ్యవస్థాపకులు, చైర్మన్, సీఈవో ప్రసాద్ గుండుమోగులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ2బీ2సీ ట్రావెల్ మార్కెట్ ప్లేస్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కంపెనీ మోండీ హోల్డింగ్స్.. నాస్‌డాక్‌లో కూడా లిస్టయ్యింది. ఈ సంస్థ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. మోండీ హోల్డింగ్స్ కార్యకలాపాలు మొదలైతే 2000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ SaaS, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కస్టమర్లు కలిగి ఉన్న ఈ సంస్థ నిత్యం 50 మిలియన్ల సెర్చెస్ కలిగి ఉన్నది. 2011లో ప్రారంభించిన మోండీ హోల్డింగ్స్‌కు అమెరికా, కెనడాలో 17 కార్యాలయాలు ఉన్నాయి. ఇండియా, థాయ్‌లాండ్, ఐర్లాండ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

రేవ్ గేర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్..

టెక్సాస్‌కు చెందిన రేవ్ గేర్స్ సంస్థ తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. అమెరికాలోని హూస్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ ప్లాంట్ పెట్టడానికి కంపెనీ ప్రతినిధులు తమ ఆసక్తిని వెల్లడించారు. ఈ సంస్థ వల్ల రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగావకాశాలు ఏర్పాడనున్నాయి.


చార్లెస్ ష్వాబ్ యాజమాన్యంతో కేటీఆర్ సమావేశం..

అమెరికాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజ కంపెనీ చార్లెస్ ష్వాబ్‌ కార్పొరేషన్ సీఐఓ డెన్నిస్ హోవర్డ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చర్చించారు. కమర్షియల్ బ్యాంకింగ్ ఇన్వెస్టింగ్, ఇతర సేవల్లో ఈ సంస్థ అగ్రగామిగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 400 బ్రాంచీలను కలిగి ఉన్న చార్లెస్ ష్వాబ్ కార్పొరేషన్.. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో రిటైల్, ఇన్‌స్టిట్యూషనల్ క్లయింట్స్‌ను కలిగి ఉన్నది. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ఈ సంస్థ ఆసక్తి చూపించింది. ఈ సమావేశంలో హోస్టన్‌లోని కాన్స్యూల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీమ్ మహాజన్ కూడా పాల్గొన్నారు.


First Published:  21 May 2023 4:49 AM GMT
Next Story