Telugu Global
Telangana

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు న్యాయం -రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుందని, ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి.

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు న్యాయం -రేవంత్ రెడ్డి
X

బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారాయన. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని, ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఉదయం యాదాద్రికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన సీఎం, ఆ తర్వాత భద్రాచలం రాములవారిని దర్శించుకున్నారు, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.


కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుందని, ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం. ఇంటి స్థలం కూడా లేని వారికి, స్థలం ఇవ్వడంతోపాటు నిర్మాణానికి రూ.5లక్షల సాయం చేస్తుంది. రూ.22,500 కోట్లతో ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.

చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పి తెలంగాణ ప్రజలను గత ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మోదీ నిజంగానే పేదలకు ఇళ్లు కట్టించి ఉంటే.. అక్కడ తాము ఓట్లు అడగబోమన్నారు. కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లాకు బలమైన బంధం ఉందని చెప్పారు. భట్టి విక్రమార్క అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారని, ఆ సమయంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఉచిత కరెంట్ ఇచ్చామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలకతీతంగా పేదలకు న్యాయం చేస్తామన్నారు.

First Published:  11 March 2024 10:39 AM GMT
Next Story