Telugu Global
Telangana

దేశంలో తొలి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లీనిక్ తెలంగాణలో ప్రారంభం

రైతులకు వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించడానికి ఈ క్లీనిక్ పని చేస్తుందని జస్టిస్ నవీన్ రావు చెప్పారు.

దేశంలో తొలి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లీనిక్ తెలంగాణలో ప్రారంభం
X

రైతులకు న్యాయపరమైన సేవలు అందించేందుకు దేశంలోనే తొలి సారి అగ్రీ లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను తెలంగాణలో ప్రారంభించారు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో పాటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్, జస్టిస్ పి. నవీన్ రావు ఈ క్లీనిక్‌ను వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో తెలంగాణ న్యాయ సేవల అథారిటీ, నల్సార్ యూనివర్సిటీ, లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంయుక్తంగా ఈ అగ్రీ లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను ఏర్పాటు చేశాయి. ఈ క్లీనిక్ ప్రాధాన్యతలను రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జస్టిస్ నవీన్ రావు వివరించారు.

రైతులకు వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించడానికి ఈ క్లీనిక్ పని చేస్తుందని చెప్పారు. ఇలాంటి క్లీనిక్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలి సారని ఆయన వివరించారు. రైతులు దుక్కి దున్నే నాటి నుంచి పండించిన పంటను మార్కెట్లో అమ్మే వరకు ఎన్నో సమస్యలు, అవాంతరాలు ఎదుర్కుంటారు. రైతులకు అనుకూలంగా చట్టాలు ఉన్నా.. వాటిని వినియోగించుకోవడంపై అవగాహన లేక నష్టపోతున్నారు. రైతుల మేలు కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసింది. వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగితే రైతులు ఎంతో లాభపడతారని ఆయన చెప్పారు.

భూమి సంబంధిత సమస్యలు, నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టం, పురుగు మందులు, ఎరువుల వల్ల కలిగే నష్టాలు, మార్కెట్‌లో మోసాలు, పంటల బీమా అందక పోవడం.. ఇలా పలు సందర్భాల్లో రైతులకు న్యాయ సలహాలు అవసరం అవుతాయి. అయితే సరైన గైడెన్స్ లేక రైతులు కోర్టులను ఆశ్రయించడానికి వెనకడుగు వేస్తారు. అంతే కాకుండా సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదించడానికి కూడా మొహమాట పడుతుంటారు. ఇలాంటి రైతులకు తగిన న్యాయ సేవలు అందించాల్సిన అవసరం ఉన్నది. అందుకే దేశంలోనే మొదటి ప్రయత్నంగా బమ్మెర గ్రామంలో అగ్రీ లీగల్ ఎయిడ్ క్లీనిక్ ప్రారంభించినట్లు జస్టిస్ నవీన్ రావు తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో ప్రముఖ కవి బమ్మెర పోతన ఇక్కడ నివసించారు. పోతన రచించిన మహాభాగవతం ఎంతో ప్రాచూర్యం పొందింది. ఆయన గొప్ప స్కాలర్ మాత్రమే కాకుండా.. జీవితాంతం రైతుగా జీవించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గౌరవార్దం బమ్మెర గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తోంది. అంతటి గొప్ప కవి బమ్మెర జన్మించిన గ్రామంలోనే రైతుల కోసం ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని లీఫ్స్ ఫౌండర్ ఎం సునీల్ కుమార్ తెలిపారు.

First Published:  19 March 2023 3:46 AM GMT
Next Story