Telugu Global
Telangana

భారత్ లో సంబరాలు - చైనా నుంచి జెండాలు.. కేటీఆర్ సెటైర్..

ఇదీ నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌ (NPA) ప్రభుత్వ గొప్పతనం అని సెటైర్లు వేశారు. వహ్ రే వహ్.. అంటూ ఆత్మ నిర్భర్ భారత్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు.

భారత్ లో సంబరాలు - చైనా నుంచి జెండాలు.. కేటీఆర్ సెటైర్..
X

మేకిన్ ఇండియా నినాదం 2014లో వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కనీసం జాతీయ జెండాలను దేశీయంగా తయారు చేసుకోలేని దుస్థితి మనది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలనేది కేంద్రం ఆలోచన. అయితే దేశీయంగా అన్ని జెండాలు తయారు చేసుకోలేని భారత్.. చైనా నుంచి పాలిస్టర్ జెండాలు దిగుమతి చేసుకుంటోంది. సరిహద్దుల్లో ఏ దేశంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో.. అదే దేశం నుంచి జాతీయ జెండాలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఇది. మిగతా వస్తువుల విషయంలో పెద్దగా పట్టింపు లేకపోయినా దేశ సార్వభౌమత్వ విషయంలో కూడా ఇలా రాజీపడటం ఎవరికీ నచ్చడంలేదు. బ్రిటిష్ వారిని తరిమేశాం అని చెప్పుకుంటూ అదే దేశం తయారు చేసిన చాక్లెట్లను స్వాతంత్ర దినోత్సవం రోజున పంచుకున్నట్టు ఉంది ఇప్పుడు చైనా జెండాల వ్యవహారం.

వహ్ రే వహ్.. ఆత్మ నిర్భర్ భారత్..

మేకిన్‌ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాని మోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారుచేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్న మాటలను కోట్ చేస్తూ.. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా ఓ నినాదానికే పరిమితం అయిందని, జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మాత్రం నిజం అని చెప్పారు. ఇదీ నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌ (NPA) ప్రభుత్వ గొప్పతనం అని సెటైర్లు వేశారు. వహ్ రే వహ్.. అంటూ ఆత్మ నిర్భర్ భారత్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు.

ఆమాత్రం ముందు చూపు లేదా..?

తెలంగాణలో కోటి జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేసేందుకు ముందస్తుగానే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 50లక్షల జెండాలను తయారు చేసే బాధ్యత చేనేత కార్మికులకు అప్పగించింది. మరో 50లక్షల జెండాలను హైదరాబాద్ లోని కార్మికులతో తయారు చేయిస్తున్నారు. అంటే మొత్తం కోటి జెండాలు మేకిన్ తెలంగాణ అనమాట. ముందస్తు ప్రణాళికల వల్ల ఒక్క జెండా కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తెలంగాణకు రాలేదు. మరి కేంద్రం పరిస్థితి ఏంటి..? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది ఏడాది ముందే అనుకున్న మాట. ఏడాదిముందే సంబరాలకు సన్నాహాలు చేసుకున్నారు. మరి జెండాల తయారీలో మాత్రం హడావిడిగా దిగుమతి చేసుకోవాలనుకోవడం ఎందుకు..? అది కూడా చైనా నుంచి. దేశీయంగా ఉన్న ఖాదీ పరిశ్రమ అన్ని జెండాలను తయారు చేయలేదని, అందుకే దిగుమతిపై ఆధారపడాల్సి వచ్చిందనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట. హడావిడిగా జెండాల సేకరణ మొదలు పెట్టకపోతే, ఏడాది ముందే ప్లాన్ చేసి ఉంటే.. అన్ని జెండాలు భారత్ లో కూడా తయారయ్యేవి కదా..? ఇది కేటీఆర్ విమర్శ. మరి కేంద్రం చైనా జెండాలపై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

First Published:  2 Aug 2022 3:10 AM GMT
Next Story