Telugu Global
Telangana

దిగొచ్చిన హెచ్‌సీఏ.. ఇవ్వాళ మ్యాచ్ టికెట్ల అమ్మకం

మంత్రి హెచ్చరికతో హెచ్‌సీఏ దిగొచ్చింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లను విక్రయిస్తామని అధ్యక్షుడు అజారుద్దీన్ లేఖ విడుదల చేశారు.

దిగొచ్చిన హెచ్‌సీఏ.. ఇవ్వాళ మ్యాచ్ టికెట్ల అమ్మకం
X

ఇండియాలో క్రికెట్‌కు ఉండే క్రేజ్‌ వేరు. మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కొని పోతారు. అలాంటిది సొంత నగరంలో మ్యాచ్ జరుగుతుంటే ఏ క్రికెట్ అభిమాని మాత్రం ఊరుకుంటారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ నెల 25న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిద్దామని అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో 39వేల టికెట్లు అమ్మడానికి వీలుంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు సంబంధించిన క్లబ్స్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర ఉన్నతాధికారుల కోసం 9 వేల పాసులను పక్కకు పెట్టారు. మిగిలిన 30 వేల టికెట్లను పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు ప్రకటించారు. అయితే హెచ్‌సీఏ అధికారులు చెబుతున్నట్లు 30 వేల టికెట్లు కాకుండా 15వేలు మాత్రమే అమ్మినట్లు తెలుస్తున్నది. దీంతో మిగిలిన టికెట్లు ఆఫ్‌లైన్ ద్వారా విక్రయిస్తారని అభిమానులు అనుకున్నారు.

ఈ నెల 25న మ్యాచ్ ఉండటంతో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం ఎప్పటిలాగానే జింఖానా గ్రౌండ్స్‌కు ప్రతీ రోజు అభిమానులు వస్తున్నారు. హైదరాబాద్ వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు బుధవారం జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చారు. ఉదయం 7 గంటలకే అక్కడకు చేరుకున్నా గేట్లు మూసి ఉండటం, హెచ్‌సీఏ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కాగా, టికెట్ల విషయంలో జరుగుతున్న రగడను తెలుసుకున్న తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. అనసవరంగా హెచ్‌సీఏ పరువు తీయవద్దని, ప్రభుత్వం భూమి ఇచ్చింది అక్కడ పది మంది ఎంజాయ్ చేయడానికి కాదని.. క్రికెట్ అభిమానులందరి కోసమని ఆయన చెప్పుకొచ్చారు. వెంటనే టికెట్ల అమ్మకం చేపట్టకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందని చెప్పారు.

మంత్రి హెచ్చరికతో హెచ్‌సీఏ దిగొచ్చింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లను విక్రయిస్తామని అధ్యక్షుడు అజారుద్దీన్ లేఖ విడుదల చేశారు. జింఖానా మైదానంలోనే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన 15 వేల టికెట్లు ఇవ్వాళ మైదానంలో అమ్మకానికి పెట్టనున్నారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ టికెట్ల విక్రయాలపై విచారణ కూడా జరపనున్నట్లు తెలుస్తున్నది. ఇవ్వాళ టికెట్ల విక్రయాన్ని, ఉప్పల్ స్టేడియంను మంత్రి పరిశీలించనున్నారు. మరోవైపు జింఖానా గ్రౌండ్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానాకు చేరుకుంటున్నారు.

First Published:  22 Sep 2022 1:13 AM GMT
Next Story