Telugu Global
Telangana

చరిత్రలో చెరిగిపోని నిజా(౦)లు

హైదరాబాద్ రాష్ట్రాన్ని అసఫ్‌ జాహిలు(నిజాం రాజులు) 1724 నుంచి 1948 వరకు 224 ఏళ్లు పాలించారు. ఏడుగురు ప్రభువుల పాలన సాగింది. రాచరికపు పాలనలో అందరి రాజుల మాదిరిగానే నిజాం రాజులు ఉన్నారు. వారి పాలనలో కూడా మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కాకపోతే వారి మంచి కంటే కూడా చెడు గురించే ఎక్కువగా ప్రచారంలో ఉంది.

చరిత్రలో చెరిగిపోని నిజా(౦)లు
X

ఈ రోజు(24 ఫిబ్రవరి) నిజాం చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వర్ధంతి. సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఆయన ఇదే రోజు తుది శ్వాస విడిచారు. అయినా ఇప్పటికీ ప్రజలు మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి, నిజాం పాలకుల గురించి చర్చించుకుంటూనే ఉంటారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు సంబంధించిన చర్చ ఈ రాష్ట్రంలో జోరుగా సాగుతుంటుంది. సెప్టెంబర్ 17,1948 రోజున నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. అది విలీనమా.? విమోచనమా..? విద్రోహమా..? అనే దానిపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన బాష్యం చెబుతుంటారు. బహుశా ఏ రాజు గురించి కూడా ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఇంతగా చర్చ జరగలేదేమో..! నిజాంల పాలనపై, ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవిత చరిత్రపై చర్చానీయ, ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. ఈ సందర్భంగా ఓసారి నిజాం పాలకుల చరిత్రను మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

హైదరాబాద్ రాష్ట్రాన్ని అసఫ్‌ జాహిలు(నిజాం రాజులు) 1724 నుంచి 1948 వరకు 224 ఏళ్లు పాలించారు. ఏడుగురు ప్రభువుల పాలన సాగింది. రాచరికపు పాలనలో అందరి రాజుల మాదిరిగానే నిజాం రాజులు ఉన్నారు. వారి పాలనలో కూడా మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కాకపోతే వారి మంచి కంటే కూడా చెడు గురించే ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఏడో నిజాం పాలనలో జరిగిన రజాకార్ల రాక్షసత్వం. వారు సాగించిన దారుణ మారణకాండలు. రజాకార్లు నిజాం ప్రభువుల చరిత్రను మసకబార్చిన మాట నిజం. అంత మాత్రాన 224 ఏళ్ల వారి పాలనను, వారు చేసిన మంచి పనులను కాదనలేము. నిజాం పేరు వినగానే ముందుగా వినిపించే పేరు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన పాలనలోని రజాకార్లు,జమీందార్లు, జాగీదార్లు, వారి అరాచకాలే గుర్తుకొస్తాయి. కానీ అంతకు ముందున్న పాలకులు, వారి మంచి తనం గుర్తుకు రాదు.

Advertisement

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలంలో ఉద్యమ నేత కేసీఆర్ మొదటి సారిగా నిజాం పాలనను ప్రశంసించారు. వారు చేసిన మంచి పనులను కొనియాడారు. అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాతనే ప్రజలు నిజాం చేసిన అభివృద్ధి వైపు దృష్టి సారించారు. అంతవరకు నిజాం రాజులు ప్రజా కంటకులుగానే ప్రచారంలో ఉన్నారు. నిజానికి నిజాం పాలన ప్రజారంజకంగా సాగిందనేది నిర్వివాదం. ప్రజా సంక్షేమం పట్ల వారికున్న చిత్తశుద్ది, లౌకికత్వం, వారి దూరదృష్టిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

లౌకికత్వం

నిజాం పాలకులు సెక్యులరిస్టులు. వారి పాలనలో మత సామరస్యం పరిఢవిల్లింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎంతో మంది ఈ నగరానికి బ్రతకడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడి ప్రజలతో మమేకమై....ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారు. ఇక్కడే స్థిరపడిపోయారు. మొదటి నిజాం కాలం నుంచే ఉత్తర భారతం నుంచి కాయస్థులు, బొందిలోళ్లు, లోథ్‌లు, పార్ధీలు, పార్శీలు, హబ్సీలు (హబ్సీగూడ) జైనులు, మార్వాడీలు, అగర్వాల్ లు, పఠాన్లు, గుజరాతీలు, సిక్కులు రాగా,ఇరాన్, ఇరాక్, ఆప్ఘన్, టర్కీ వంటి విదేశాల నుంచి కూడా అనేక మంది వచ్చారు. ఓల్డ్ సిటీలో స్ధిరపడ్డ వ్యాపారులు ఆ తర్వాత నగరం విస్తరిస్తున్నా కొద్దీ కోఠి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్ ఆ తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు వెళుతున్నారు.

నిజాం పాలనలో హిందువులు కీలక పదవులు నిర్వహించారు. మహారాజా చందూలాల్, కిషన్ పర్ షాద్ ప్రధానులుగా పనిచేశారు. సాధారణంగా ముస్లింలే ఉండే హైదరాబాద్‌ కొత్వాల్ (పోలీస్ కమిషనర్) గా హిందువైన వెంకటరామారెడ్డిని నియమించారు. ఏడో నిజాం ఆయన్ను రాజా బహద్దూర్ బిరుదుతో సత్కరించారు. రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి 14 సంవత్సరాలు కొత్వాల్ గా ఉన్నారు. కిషన్ పర్ షాద్ ప్రధానిగా, రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి కొత్వాల్ గా ఏక కాలంలో పనిచేశారు.

దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల నిజాం పాలకులు దయతోనే వ్యవహరించారనడానికి ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ కరీంనగర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ జిల్లాకు చెందిన నర్సయ్య అనే మాదిగ కులస్థుడు రాజుకు మంచి కిర్రు చెప్పుల జత కుట్టుకొని స్వయంగా తీసుకెళ్లి ఇచ్చాడు. అతని పని తనానికి మెచ్చిన మహబూబ్ అలీ ఖాన్ 20 ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు. తర్వాత భూస్వాములు నర్సయ్యకు రెండు ఎకరాలు ఇచ్చి మిగతా భూమి వారే తీసుకున్నారు. ఇంకొంత కాలం పోయిన తర్వాత నర్సయ్య దగ్గర నుంచి ఆ రెండెకరాలు కూడా లాక్కున్నారు. రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్, రచయిత వై.బి.సత్యనారాయణ నాటి దళితుల పరిస్థితి, మూడు తరాల తమ వంశస్థుల గురించి రాసిన 'My Father Balaiah' అనే పుస్తకంలో వివరించాడు. ఇక్కడ నర్సయ్య రచయిత సత్యనారాయణకు స్వయాన తాత.

హైదరాబాద్ కు చెందిన భాగ్యరెడ్డి వర్మ దళితుడు. సంఘ సంస్కర్త. సమాజంలో వేళ్లూనుకుపోయిన అంటరాని తనం, జోగిని వ్యవస్థ, ఇతర సాంఘీక దురాచారాల నిర్మూలించడానికి తన వంతు కృషి చేశాడు. జగన్ మిత్ర మండలి పేరుతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. ఆది హిందూ ఉద్యమాన్ని నడిపాడు. అంటరాని వారమైన తమను కులం పేరుతో కాకుండా ఆది హిందువులుగా పిలవాలన్న భాగ్యరెడ్డి వర్మ విజ్ణప్తిని వెంటనే అంగీకరించిన ఏడో నిజాం అంటరాని వారిని ఆది హిందువులుగా మారుస్తూ ఆదేశాలిచ్చారు. దళితుడైన భాగ్యరెడ్డి వర్మను తన ప్రభుత్వంలో ప్రధాన సలహారుగా నియమించుకున్నారు.

కుల వివక్ష తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లోనే మొహర్రం పండుగలో దళితులు, వెనకుబడిన కులాల వారిని భాగస్వామ్యం చేశారు. అందుకే ఈ రోజు వరకు కూడా మొహర్రం పండుగలో దళితులు, వెనుకబడిన కులాల వారు ప్రధాన పాత్ర పోషిస్తారు. దళిత వాడల్లోకి కూడా పీర్లు వెళ్తుంటాయి. వారు కూడా కుడుకలు, బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అందుకే దళితులు, వెనకబడిన కులాల వారు కూడా లతీఫ్‌, జహంగీర్, సైదులు వంటి ముస్లిం పేర్లు పెట్టుకుంటారు.

అభివృద్ధి :

నిజాంల పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తమైంది. గోల్కొండ కోటపై వజ్రాలు,ముత్యాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మారు. ఆ తర్వాత ఈ మార్కెట్లన్నీ చార్మినార్ కు మారాయి. దీంతో విదేశీ మార్కెట్ పెరిగింది. ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. హైదరాబాద్ కు ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ అని పేరు వచ్చింది. ఆనాడున్న బ్రిటీష్ ఇండియాలోని అన్ని సంస్థానాల కంటే హైదరాబాద్ గొప్ప నగరంగా కీర్తి గాంచింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై నిజాం ప్రభువులకున్న దూరదృష్టి చాలా గొప్పది. ఆరో నిజాం, ఏడో నిజాం కాలంలో పారిశ్రామికంగా నగరం అభివృద్ధికి పునాదులు పడ్డాయి. రైల్వేకు భూములిచ్చారు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లను నిర్మించారు. నిజాం రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్‌, విద్యుత్ రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతుల కల్పించారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశరయ్యతో హైదరాబాద్ నగరానికి ప్రణాళిలు వేయించారు. నాడు వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నేటికి కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, డెక్కన్ రేడియో స్టేషన్ నెలకొల్పారు. నిజాం సొంత కరెన్సీని ముద్రించుకున్నారు. భారతీయ సినిమా చరిత్రకు పునాదులు నిజాం కాలంలోనే పడ్డాయి. బీఆర్, ఆజాం జాహి వంటి టెక్స్ టైల్స్ మిల్స్ ఏర్పడ్డాయి. మన బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. విదేశీ మారకం పెరిగింది..సంపద పెరిగింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టైమ్స్ పత్రిక ప్రకటించింది.

తాగు నీళ్లు, సాగు నీళ్ల కోసం నిర్మించిన నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ , మూసీ ప్రాజెక్ట్ లు, ఎయిర్ పోర్ట్, ఉస్మానియా హాస్పిటల్,దుర్రెషవర్ హాస్పిటల్, నీలోఫర్ , కోరంటి (ఫీవర్ హాస్పిటల్) బొక్కల దవాఖనా (నిమ్స్ ), యునాని హాస్పెటల్ , చెస్ట్ హాస్పిటల్ ,పాగల్ దవాఖనా(మెంటల్ హాస్పిటల్), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఆలియా కాలేజ్, నిజాం కాలేజ్, టౌన్ హాల్ (అసెంబ్లీ), జూబ్లీ హాల్, బెల్లా విస్టా (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్‌), ఎర్రమంజిల్ ప్యాలెస్ (ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీస్), హైకోర్టు వంటి పెద్ద పెద్ద కట్టడాలు, నిర్మాణాలు నేటికీ ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ౩ వేల ఎకరాల్లో నిర్మించిన ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు వరకు దేశంలోనే అతిపెద్ద, ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా నిలుస్తోంది. ఆ రోజుల్లోనే హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకోసం డబుల్ డెక్కర్ బస్సులను నడిపించిన చరిత్ర కూడా వారి సొంతమే.

నిజాంల దాతృత్వం :

నిజాం పాలకుల దాతృత్వం కూడా గొప్పది. శరణు జొచ్చిన వారిని కాదనకుండా పిడికిళ్లు, దోసిళ్ల కొద్దీ అష్రపీ (బంగారు నాణేలు) లు దానం చేసే వారు. వారి పాలనలో సాంస్కృతిక వైభవం విలసిల్లింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోడళ్లయిన దుర్రెషవర్, నీలోఫర్ లు నాటి రాచరిక వ్యవస్థలోనే ఆధునిక మహిళలుగా జీవించారు. ఘోష, పర్దాలు పక్కన బెట్టారు. ప్రజల్లో తిరిగారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. దుర్రెషవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్స్ వారు కట్టించినవే. ఇవన్నీ చరిత్రకు సాక్షీభూతాలు. చెరిగిపోని నిజాలు.

Next Story