Telugu Global
Telangana

భారత జైళ్లలో పెరుగుతున్న మరణాలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

ఇండియాలోని జైళ్లలో సంభవించే మరణాలను రెండు రకాలుగా గుర్తించి, నమోదు చేస్తారు.

భారత జైళ్లలో పెరుగుతున్న మరణాలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం
X

భారత జైళ్లలో దయనీయమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా మన దేశ జైళ్లలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా వీటిలో అసాధారణ, అనుమానాస్పద మరణాలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. భారత జైళ్ల సంస్కరణలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టులో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనంలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. భారత జైళ్లలో ఖైదీలలో వయస్సు పైబడటం, అనారోగ్యం వంటి సమస్యల కారణంగా మరణించిన వారికంటే అసాధారణంగా మరణించిన వారే ఎక్కువ అని తేలింది. ముఖ్యంగా యూపీలోని జైళ్లలో 2017 నుంచి 2021 మధ్యలో ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకున్నట్లు తేల్చింది. 2019లో కస్టోడియల్ డెత్స్ ఎక్కువగా ఉన్నట్లు కమిటీ అధ్యయనంలో తేలింది.

ఇండియాలోని జైళ్లలో సంభవించే మరణాలను రెండు రకాలుగా గుర్తించి, నమోదు చేస్తారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆశ్వర్యంలో ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా రిపోర్టులో ఖైదీల మరణాలను సాధారణం, అనుమానాస్పదం అనే కేటిగిరీలుగా నమోదు చేస్తారు. 2021లో 2,116 మంది ఖైదీలు జ్యుడీషియల్ కస్టడీలో మరణించగా.. వారిలో 90 శాతం మందివి సాధారణ మరణాలుగా నమోదు అయ్యాయి. వయసు మీదపడటం, అనారోగ్య సమస్యల వల్ల మరణిస్తే సాధారణ మరణాలుగానే నమోదు చేస్తారు. ఇక అనారోగ్య సమస్యల్లో గుండె సంబంధిత, హెచ్ఐవీ, టీబీ, క్యాన్సర్ వంటి రోగాలను ఆ రిపోర్టులో మెన్షన్ చేస్తారు. జైళ్లలో ఖైదీల సంఖ్య కూడా పెరుగుతుండటంతో.. మరణాల సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతోంది. 2016లో 1,424 మరణాలు సంభవించగా.. 2021లో ఆ సంఖ్య 1,879కి పెరిగింది.

ఇక అసాధారణ మరణాలను పలు విధాలుగా వర్గీకరించారు. ఉరి వేసుకొని, విషం తీసుకొని, స్వంతగా గాయపర్చుకొని, అత్యధిక మోతాదులో మందులు తీసుకొని, కరెంటు షాక్ పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకోవడం ఒక కేటగిరీలో ఉండగా.. తోటి ఖైదీల కారణంగా మరణించిన వారు, బయటి వ్యక్తుల ద్వారా మరణం సంభవించిన వారు, అగ్ని ప్రమాదం, నిర్లక్ష్యం, ప్రమాదవశాత్తు సంభవించే మరణాలను మరో కేటగిరీలో పేర్కొన్నారు. ఇక ప్రకృతి విపత్తుల కేటగిరీ కూడా ఉన్నది. ఇందులో భూకంపాలు, పాము కాటు, నీళ్లలో మునగడం వంటి కారణాలను పేర్కొంటున్నారు. భారత జైళ్లలో నమోదవుతున్న ఆత్మహత్యల రేటు.. బయట సాధారణ పౌరుల ఆత్మహత్యల రేటుకంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు కమిటీ అధ్యయనంలో తేలింది.

భారత జైళ్లలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులపై సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. జైళ్లలోని మౌలిక సదుపాయాల కారణంగా కస్టోడియల్ మరణాలు సంభవిస్తున్నాయని జస్టిస్ ఎంబీ లోకుర్ తెలిపారు. సాధారణ, అసాధారణ మరణాల మధ్య తేడా అస్పష్టంగా ఉందని అన్నారు. ఎవరైనా ఖైదీ సరైన వైద్యం అందక చనిపోతే దాన్ని సాధారణ మరణాలుగా పరిగణించాలా అని వ్యాఖ్యానించారు. ఇది రోగం కారణంగా మరణించిన సాధారణ మరణమా లేదంటే వైద్యం అందించడంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా సంభవించిన అసాధారణ మరణమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జైళ్లలో సంభవించే మరణాలపై చాలా వరకు ఫిర్యాదులు అందడం లేదని.. అంతే కాకుండా వాటిపై సరైన దర్యాప్తు కూడా ఉండటం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే అసాధారణ మరణాలు కూడా సాధారణ మరణాల కిందే లెక్కవేస్తున్నట్లు స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా రూపొందించిన రిపోర్టులో కోవిడ్ మరణాలను కూడా సాధారణ మరణాలుగా పేర్కొన్నది. ఆ సమయంలో మన దేశంలోని జైళ్ల ఆక్యుపెన్సీ 118 శాతంగా ఉంది. అంటే సాధారణం కంటే ఎక్కువ మంది జైళ్లలో ఉన్నారు. 40 వేల మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో బంధించబడి ఉన్నారు. ఆ ఏడాది 125 మంది ఖైదీలకు ఒక మెడికల్ స్టాఫ్ ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి 219 మందికి ఒక స్టాఫ్ ఉన్నారు. అది అసాధారణమైన విషయమని సుప్రీంకోర్టు చెప్పింది.

మన దేశంలోని జైళ్లలో వైద్య సదుపాయాల కోసం 5 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 2016 నుంచి 2021 వరకు కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ నిధులనే ఖర్చు చేసినట్లు తేలింది. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని.. ఇవి అసాధారణ మరణాలకు కారణం అవుతున్నాయని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్‌లో పేర్కొన్నారు. జైళ్లలో సంభవించే కస్టోడియల్ మరణాలపై 24 గంటల్లో ఎన్‌సీఆర్‌బీకి తెలియజేయాలి. ఆ మరణానికి సంబంధించిన పోస్టు మార్టమ్ రిపోర్టులు, వీడియోగ్రఫీ రిపోర్టులు అందించాలి. ఒక వేళ జైలు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల సదరు ఖైదీ మరణిస్తే.. కేంద్ర ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబీకులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 2022లో స్వయంగా కేంద్ర హోం శాఖ లోక్‌సభలో తెలియజేసింది.

అయితే 2021-22లో సంభవించిన అసాధారణ మరణాల్లో కేవలం ఒకే ఒక దానిపై మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కస్టోడియల్ మరణాల్లో రేప్ వంటివి జరిగి మరణించినా తప్పనిసరిగా జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరగాలి. కానీ ఇలాంటివి ఏమీ కూడా చాలా వరకు జరగడం లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ జైళ్లలో సంభవించే సాధారణ మరణాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కస్టోడియల్ మరణాలపై లోతుగా, పూర్తి స్థాయిలో విచారణ జరిగితే.. సాధారణ మరణాలుగా నమోదవుతున్నవి కూడా అసాధారణమని తేలిపోతుందని కోర్టు భావిస్తోంది.

జైళ్లలో ఆత్మహత్యలను నివారించడానికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పుర్కొన్నది. తాళ్లు, గాజు , నిచ్చెనలు, పైపుల వంటివి అందుబాటులో లేకుండా చూడాలని సూచించింది. ఖైదీల మానసిక స్థితిని జైలులోకి వచ్చిన సమయంలో అంచనా వేయాలని చెప్పింది. అంతే కాకుండా సీసీటీవీ కెమేరాలను ఎక్కువగా ఫిక్స్ చేయడం వల్ల ఖైదీలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. జైళ్లలో ఉన్న ఖైదీల జనాభాలో 1.5 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వీరికి సరైన చికిత్స అవసరం అని తెలిపింది.

First Published:  3 Oct 2023 7:28 AM GMT
Next Story