Telugu Global
Telangana

కాంగ్రెస్ లో చేరికలతో పెరుగుతున్న గొడవలు...ఏఐసీసీ కొత్త రూల్స్

తెలంగాణలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతుండటం ఆ పార్టీలో గొడవలు సృష్టిస్తున్నాయి. పీసీసీఅధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇతర సీనియర్ నాయకుల మధ్య ఈ చేరికలపై విబేధాలు గుప్పుమంటున్నాయి.

కాంగ్రెస్ లో చేరికలతో పెరుగుతున్న గొడవలు...ఏఐసీసీ కొత్త రూల్స్
X

కాంగ్రెస్ ఓడిపోయినా పర్వాలేదు...బలహీనపడినా పరవాలేదు...కానీ తమ మాటే చెల్లాలన్న ధోరణి ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా ఉంటుంది. తమకు నచ్చని విషయాలపట్ల బహిరంగంగానే మాట్లాడుతుంటారు నాయకులు..... ముగ్గురు నాయకులుంటే నాలుగు గ్రూపులు ఏర్పడతాయన్న పేరు సంపాదించింది కాంగ్రెస్ పార్టీ.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. అయినా నాయకుల్లో ఐక్యత కొరవైందని విమర్షలున్నాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసిన తర్వాత ఒకవైపు పార్టీ బలపడుతున్న సూచనలతో పాటు నాయకుల మధ్య కయ్యాలు కూడా పెరుగుతున్నాయి.

గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెల్చిన నాయకులతో సహా అనేక మంది కాంగ్రెస్ నాయకులు టీఆరెస్, బీజేపీల్లో చేరిపోయారు. చాలా చోట్ల నాయకులు లేని పార్టీగా మారిపోయింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో పార్టీలోకి పెద్దఎత్తున చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మధ్య కొంత మంది ప్రజాబలమున్న నాయకులు ఇతర పార్టీలనుండి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడీ చేరికలు సీనియర్ నాయకుల మధ్య గొడవలకు కారణమవుతోంది. బహిరంగంగానే విమర్షలు ప్రతి విమర్షలు చేసుకుంటూ కార్యకర్తలను గందరగోళ పరుస్తున్నారు.

మెట్ పల్లి జెడ్పీటీసీ చేరికపై మధుయాష్కీ కి, ఖమ్మం జిల్లాలో చేరికల‌పై భట్టి విక్రమార్కకు, దేవరకొం డ చేరికలపై ఉత్తమ్ కుమార్ కు , మెదక్ లో చేరికలపై దామోదర రాజనర్సింహకు రేవంత్ రెడ్డి కనీస సమాచారం ఇవ్వలేదట. దీనిపై భట్టి విక్రమార్కతో మొదలైన గొడవ మధుయాష్కీ, ఉత్తమ్ కుమార్, రాజనర్సింహ లతో పతాక స్థాయికి చేరుకుంది. భట్టిని అధిష్టానం ఢిల్లీకి పిలిచి మాట్లాడినప్పటికీ ఈ గొడవలు ఆగలేదు. రేవంత్ పై అధిష్టానానికి పిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.

మరో వైపు సీనియర్ నాయకుడు జానారెడ్డి అద్వర్యంలో అధిష్టానం ఏర్పాటు చేసిన చేరికల కమిటీ పేరుకే మిగిలిపోయింది. ఏ చేరికపై ఆ కమిటీకి సమాచారం ఉండటం లేదని జానారెడ్డి కూడా గుర్రుగా ఉన్నారు.

అయితే చేరికలకు సంబంధించి ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇస్తున్నామని, వారి అనుమతి తోనే చేరికల కార్యక్రమం నడుస్తోందని రేవంత్ వర్గం వాదిస్తోంది. ముందుగానే అందరికీ చెప్తే సమాచారం బైటికి పొక్కి చేరికలు ఆగిపోతాయనే భయం రేవంత్ ను వెంటాడుతుందట. ఈ పరిస్థితుల్లో ఈ సమస్యకు అధిష్టానం ఓ పరిష్కారాన్ని సూచించింది. ఇకపై పార్టీలో ఎవరు చేరుతున్నా .. 48 గం టల ముందు ఏఐసీసీ కార్య దర్శి బోసురాజుకు సమాచారం ఇవ్వా లని ఏఐసీసీ ఆదేశించిందట. ఆ తర్వా త బోసురాజు సంబంధిత జిల్లా నేతలకు.. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోం ది.

మరి ఈ పరిష్కారం నాయకుల మధ్య గొడవలు తగ్గిస్తాయా ? ముందుగా చెప్తే సమాచారం బైటికి పొక్కి చేరికలు ఆగిపోతాయని భావించే రేవంత్, భోస్ రాజుకు 48 గంటల ముందు సమాచారం ఇస్తారా ? ఇస్తే అది తెలిసిన ఇతర నాయకులు చేరికలను సజావుగా సాగనిస్తారా ? ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలే!

First Published:  22 July 2022 12:44 PM GMT
Next Story