Telugu Global
Telangana

ఇవాళే వల్మిడి రామాలయం పున:ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రులు..!

పునర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయం నయనానందకరంగా నిలుస్తోంది. 50 ఎకరాల సువిశాలమైన గుట్టపై రాముడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం.

ఇవాళే వల్మిడి రామాలయం పున:ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రులు..!
X

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభం, విగ్రహాల పున:ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమైంది. అలాగే మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. ఇవాళ త్రిదండి చినజీయర్‌ స్వామి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఈ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

రూ.50 కోట్లతో నిర్మించిన వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభం, విగ్రహాల పునఃప్రతిష్టాపన చేయనున్నారు. పాలకుర్తిలో రూ.10కోట్లతో తలపెట్టిన పాల్కురికి సోమనాథుడి మెమోరియల్‌ స్టాచ్యూ, సోమనాథుడి కల్యాణ మండపం,రూ.2 కోట్లతో తలపెట్టిన మిషన్‌ భగీరథ ఆఫీసు,రూ.25కోట్లతో తలపెట్టిన హరిత కాకతీయ హోటల్‌ పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక వల్మిడిలో దాదాపు 150 కోట్లతో మంజూరు చేసిన రోడ్లు, 2 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన బ్రిడ్జిని మంత్రులు ప్రారంభించనున్నారు.

ఇక పునర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయం నయనానందకరంగా నిలుస్తోంది. 50 ఎకరాల సువిశాలమైన గుట్టపై రాముడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. రామాయణాన్ని రచించిన వాల్మీకి కొంతకాలం ఇక్కడ ఉన్నారని ప్రతీతి. గతంలో స్వామి దర్శనానికి వెళ్లాలంటే సరైన మార్గం కూడా ఉండేది కాదంటున్నారు భక్తులు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో ఆలయం అభివృద్ధికి నోచుకుంది. రూ.25 కోట్లతో కొండపైకి మెట్లు, స్వాగత తోరణం, దేవస్థానం చుట్టూ ప్రహారీ, కనమదారి, భక్తులు సేదతీరేందుకు కుటీరాలు ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చరిత్రత్మాక కట్టడాలను పునఃనిర్మాణం చేపడుతుంది.

అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈమేరకు సీఎం పర్యటన కూడా ఖరారైంది. అయితే, సీఎం సతీమణి అస్వస్థతకు గురి కావడంతో ఆఖరి నిమిషంలో ఈ పర్యటన రద్దు అయినట్లు సమాచారం.

*

First Published:  4 Sep 2023 3:51 AM GMT
Next Story