Telugu Global
Telangana

ఇవాళే ఆఖరు.. ప్రధాన నేతల ప్రచారం ఎక్కడంటే..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి, సిరిసిల్ల రోడ్‌ షోల్లో పాల్గొంటారు. హరీష్ రావు మెదక్ నియోజకవర్గంలోని చేగుంట, సిద్దిపేట పట్టణం, కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో రోడ్‌ షోల్లో పాల్గొంటారు.

ఇవాళే ఆఖరు.. ప్రధాన నేతల ప్రచారం ఎక్కడంటే..!
X

ఇవాల్టితో ప్రచార ప‌ర్వానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేప‌ట్ట‌నున్నారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ఇవాళ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ స‌భ‌తో ఎన్నిక‌ల‌ ప్రచారం ముగించనున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. రోజుకూ మూడు, నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ఇవాళ వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా నిర్వహించే సభలో పాల్గొంటారు. తర్వాత గజ్వేల్‌లో నిర్వహించే బహిరంగ సభతో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు ముగుస్తాయి. జనగామ నియోజకవర్గంలో రెండు సభల్లో పాల్గొన్నారు కేసీఆర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 7, హైదరాబాద్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగలేదు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి, సిరిసిల్ల రోడ్‌ షోల్లో పాల్గొంటారు. హరీష్ రావు మెదక్ నియోజకవర్గంలోని చేగుంట, సిద్దిపేట పట్టణం, కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో రోడ్‌ షోల్లో పాల్గొంటారు.

ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు. జూబ్లిహిల్స్ ఆటో వర్కర్స్, గిగ్ వర్కర్స్‌ యూనియన్లతో రాహుల్ భేటీ కానున్నారు. తర్వాత నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడతారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ ఎన్నికల సభలో పాల్గొన్ని ప్రచారం నిర్వహిస్తారు. రాహుల్‌,ప్రియాంక, రేవంత్ కలిసి హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కంటోన్మెంట్, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో రోడ్‌ షో ఉంటుందని సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలో ప్రధాని మోడీ, అమిత్ షా సభలు ఇప్పటికే పూర్తి కాగా..పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కీలక నేతలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక అన్ని పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించనున్నాయి.

First Published:  28 Nov 2023 1:30 AM GMT
Next Story