Telugu Global
Telangana

గాంధీలో సంతాన సాఫల్య కేంద్రం.. తెలంగాణకి గర్వకారణం

ఇప్పుడు అధునాతన పరికరాలు, పద్ధతులు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. రూ.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌) చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు.

గాంధీలో సంతాన సాఫల్య కేంద్రం.. తెలంగాణకి గర్వకారణం
X

గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఈరోజు ఈ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. పేదలకు ఉచితంగా ఇక్కడ సంతాన సాఫల్యత సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఈ తరహా సేవలు తెలంగాణ వైద్యరంగానికే మరో అరుదైన గుర్తింపు తీసుకురాబోతున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యసేవలు సకాలంలో, సరైన విధంగా అందుబాటులో ఉంటే అదే పదివేలు. కానీ తెలంగాణలో సంతాన సాఫల్య సేవలను కూడా పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ రంగంలో ఇలాంటి సంతాన సాఫల్య కేంద్రాలు అరుదు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తల్లీపిల్లల విభాగంలోని ఐదో అంతస్తులో ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సంతాన లేమి సమస్యతో బాధపడే తల్లిదండ్రులు కృత్రిమ పద్ధతుల్ని ఆశ్రయించడం ఖర్చుతో కూడుకున్న పని. బిడ్డలకోసం తల్లిదండ్రులు పడే ఆవేదనను ప్రైవేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ దశలో పేదలకు కూడా సంతాన సాఫల్య వైద్య చికిత్సలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

2018లోనే గాంధీలో సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో వైద్యపరీక్షలు, కౌన్సెలింగ్‌ సేవలు అందుబాటులో ఉండేవి. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో శుద్ధి చేసి భార్య అండాశయంలోకి ప్రవేశపెట్టే విధానంలో కూడా కొంతమందికి చికిత్స అందించారు. ఇప్పుడు అధునాతన పరికరాలు, పద్ధతులు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. రూ.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌) చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు. ల్యాబ్‌ లోనే పిండాన్ని ఫలదీకరణ చేసి, మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అయినా, గాంధీ ఆస్పత్రిలో మాత్రం ఈ సేవలు ఉచితం. రీకేనలైజేషన్ ఆపరేషన్లు కూడా గాంధీలో ఉచితంగా చేస్తున్నారు.

First Published:  8 Oct 2023 1:32 AM GMT
Next Story