Telugu Global
Telangana

మెడికల్ కాలేజీల విషయంలో గుజరాత్ అలా, తెలంగాణ ఇలా..

ఈ కొత్త మెడికల్ కాలేజీలకు డమ్మీ టీచర్ల ప్రాతిపదికన ఆమోదం లభించింది. నియామకాలు జరిగినా అవి మూడేళ్ల కాలానికే లోబడి ఉంటున్నాయి. ఇవన్నీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటవుతున్నాయి.

మెడికల్ కాలేజీల విషయంలో గుజరాత్ అలా, తెలంగాణ ఇలా..
X

మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం ఎప్పుడో చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలే తమ సొంత ఖర్చుతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రం సహకరించకపోవడంతో, పూర్తిగా సొంత నిధులతో జిల్లాకొక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని నిర్మిస్తోంది. ఇప్పటికే 12 కాలేజీలు ఏర్పాటు చేయగా.. తాజాగా 8 కళాశాలల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గుజరాత్‌లో అలా..

బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వం కూడా పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ కాలేజీల వల్ల యాజమాన్యాలకు లాభమే కానీ, ప్రజలకు మాత్రం ఉపయోగం లేదు. గోద్రా, పోర్ బందర్, మోర్బి, నవసరి, రాజ్ పిప్ల.. ప్రాంతాల్లో గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ(GMERS) ఆధ్వర్యంలో 5 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకి నేషనల్ మెడికల్ కమిషన్(NMC) లెటర్ ఆఫ్ పర్మిషన్ మంజూరు చేసింది. ఇక్కడితో సంబరపడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త మెడికల్ కాలేజీలకు డమ్మీ టీచర్ల ప్రాతిపదికన ఆమోదం లభించింది. నియామకాలు జరిగినా అవి మూడేళ్ల కాలానికే లోబడి ఉంటున్నాయి. ఇవన్నీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటవుతున్నాయి.

గుజరాత్‌తోనే మొదలు..

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీల ఏర్పాటు గుజరాత్‌తోనే మొదలైంది. 2016లో గుజరాత్‌లో ఆరు కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలో కూడా ఇదే పద్ధతిలో ఈ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రెండో దఫా గుజరాత్‌లో ఇలాంటి కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. వీటి వల్ల ప్రభుత్వ వైద్యం కనుమరుగవుతుంది. నేరుగా ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి కాలేజీలు వెళ్లకపోయినా, రాబోయే రోజుల్లో పరిస్థితి మాత్రం అదే. దేశంలో పీపీపీ పద్ధతిలో జిల్లా ఆస్పత్రులను నిర్వహించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే లోక్‌ సభలో స్పష్టం చేసింది. కానీ అదే సమయంలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తానంటే మాత్రం జిల్లా ఆస్పత్రులను ప్రైవేటుకి అప్పగించినట్టేనని అంటున్నారు.

తెలంగాణ ఆదర్శం..

ఈ విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రైవేటుకి ఏమాత్రం అవకాశం లేకుండా, కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీల ఏర్పాటుకి సిద్ధపడింది. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పూర్తి నిర్వహణలో 12 కాలేజీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మరో 8 కాలేజీల ఏర్పాటుకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గుజరాత్ లాగా, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లాగా ప్రైవేటు పరం చేయాలనుకోలేదు.

First Published:  10 Aug 2022 5:14 AM GMT
Next Story