Telugu Global
Telangana

మునుగోడు బరిలో టీఆర్ఎస్సా..? బీఆర్ఎస్సా..?

మునుగోడులో పోటీకి దిగే అభ్యర్థి టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేస్తారా..? బీఆర్ఎస్ పేరుతో ఆయనకు బీ ఫామ్ ఇస్తారా..? ఆయన టీఆర్ఎస్ చిట్టచివరి అభ్యర్థిగా చరిత్రలో నిలిచిపోతారా..? బీఆర్ఎస్ మొట్టమొదటి అభ్యర్థిగా రికార్డ్ సృష్టిస్తారా..?

మునుగోడు బరిలో టీఆర్ఎస్సా..? బీఆర్ఎస్సా..?
X

టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇకనుంచి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ అని పిలవాలా..? కొన్నాళ్లు పాత పేరే అమలులో ఉంటుందా అనే అనుమానం చాలామందిలో ఉంది. రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థి బరిలో దిగుతారా..? లేక బీఆర్ఎస్ తరపున పోటీ చేసే తొలి అభ్యర్థిగా ఆ నాయకుడు చరిత్రలో నిలిచిపోతాడా..? ఆ అనుమానాలు కూడా టీఆర్ఎస్ క్యాడర్లో ఉన్నాయి. ఇంతకీ మునుగోడులో పోటీకి దిగే అభ్యర్థి టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేస్తారా..? బీఆర్ఎస్ ఆయనకు బీ ఫామ్ ఇస్తుందా..?

ఉప ఎన్నిక వరకు టీఆర్ఎస్సే..

మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం టీఆర్‌ఎస్‌ పేరుతోనే పోటీ జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆలోగా టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్ గా మారదు. అంటే టీఆర్ఎస్ పేరుమీదే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబర్-3న పోలింగ్ 6వతేదీన ఫలితాలు వెలువడతాయి. సో.. మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థి టీఆర్ఎస్ తరపున పోటీ చేసే చిట్ట చివరి అభ్యర్థిగా చరిత్రలో నిలిచిపోతారనమాట.

ఈరోజు ఎన్నికల కమిషన్ ముందుకు..

పార్టీ పేరును సవరిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత కనీసం 30 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాలి. సంబంధిత పత్రాలను నిర్దేశిత ఫార్మాట్‌ లో సమర్పించాలి. టీఆర్ఎస్ ని బీఆర్‌ఎస్‌ గా మారుస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకొని నేతలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు అపాయింట్ మెంట్ ఇచ్చింది. సో.. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తారనమాట. దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది..

నిబంధనలు ఇలా ఉంటాయి..

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. కొత్తగా పెట్టే పేరు అప్పటికే మనుగడలో ఉన్న ఇతర పార్టీలకు ఉండకూడదు. ఆమేరకు బీఆర్ఎస్ కి ఎలాంటి అవాంతరాలు లేవనే చెప్పాలి. అయితే లాంఛనంగా పేరుమార్పుపై వారు ఓ నోటిఫికేషన్ విడుదల చేస్తారు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికారికంగా బీఆర్ఎస్ మనుగడలోకి వస్తుంది. అయితే కారు గుర్తు మాత్రం మారదు. పేరు టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా గుర్తు అలానే ఉంటుంది. కానీ జెండా విషయంలో మాత్రం మార్పులు చేర్పులు జరుగుతాయి.

First Published:  6 Oct 2022 3:14 AM GMT
Next Story