Telugu Global
Telangana

గృహలక్ష్మి పథకం అమలు, పోడు భూముల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

Gruha Lakshmi Scheme in Telangana: తొలి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది చొప్పున ఈ పథకాన్ని వర్తింప చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Gruha Lakshmi Scheme: గృహ లక్ష్మి పథకం అమలు, పోడు భూముల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం
X

Gruha Lakshmi Scheme: గృహ లక్ష్మి పథకం అమలు, పోడు భూముల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణలోని పేదల ఇంటి కలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త పథకాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు పథకాల అమలుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సొంత స్థలం ఉండి, ఇంటి నిర్మాణం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.

తొలి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది చొప్పున లబ్దిదారులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సొంత స్థలం ఉన్న లబ్దిదారులను గుర్తించి.. వారికి మూడు దశల్లో రూ.3 లక్షలను అందజేయనున్నారు. పునాది దశలో రూ.1 లక్ష, స్లాబ్ దశలో మరో రూ.1 లక్ష.. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన రూ.1 లక్ష అందజేయాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గృహ లక్ష్మి పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకోవాలని భావిస్తున్న లబ్దిదారులకు దశల వారీగా ఈ పథకం వర్తింప చేయాలని, ఇందుకు సంబంధించిన నిర్దిష్ట విధివిధానాలను రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపాలని సీఎస్‌ శాంతి కుమారిని ఆదేశించారు.

దశాబ్ది ఉత్సవాలు ముగిసిన తర్వాత జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసి, గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,05,601 ఎకరాల భూములకు పట్టాలు అందిస్తారు.

ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 1,50,012 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక పోడు భూముల పట్టాలు అందించిన తర్వాత.. ప్రభుత్వమే ఆయా లబ్దిదారుల పేరుతో బ్యాంకు అకౌంట్లు తెరిపిస్తుందని.. ఆ తర్వాత రైతు బంధు లబ్ది దాంట్లోనే జమ చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. 3.08 లక్షల మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు బంధు వర్తింప చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

First Published:  26 May 2023 5:15 AM GMT
Next Story