Telugu Global
Telangana

తెలంగాణకు అక్రమ మద్యం.. నెలకు రూ.150 కోట్ల నష్టం

ఎక్సైజ్ శాఖ ఏడాదికి దాదాపు రూ.2వేల కోట్ల మేర నష్టపోవడం అంటే ఆర్థికంగా భారమే అని అధికారులు అంటున్నారు.

తెలంగాణకు అక్రమ మద్యం.. నెలకు రూ.150 కోట్ల నష్టం
X

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం కారణంగా తెలంగాణ ఖజానాకు నెలకు రూ.150 కోట్ల మేర నష్టం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్మగ్లర్లు ఇక్కడి కంటే తక్కువ రేట్లు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొని వచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇటీవల సరిహద్దుల వద్ద పలు వాహనాల తనిఖీలో భారీగా మద్యం పట్టుబడటంతో అధికారులు అప్రమత్తయ్యారు. తెలంగాణ ఖజానాకు జీఎస్టీ తర్వాత అత్యధిక వసూళ్లు ఎక్సైజ్ శాఖ నుంచే వస్తాయి. ఈ క్రమంలో నెలకు రూ.150 కోట్ల నష్టం అంటే.. ఏడాదికి రూ.1,800 కోట్ల మేర నష్టం వస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వీటి అవసరాల కోసం అప్పు చేయాలంటే కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. ఇలాంటి సమయంలో ఎక్సైజ్ శాఖ ఏడాదికి దాదాపు రూ.2వేల కోట్ల మేర నష్టపోవడం అంటే ఆర్థికంగా భారమే అని అధికారులు అంటున్నారు. మద్యం దుకాణాల యాజమాన్యాలు ఇటీవల అక్రమ మద్యంపై కొరఢా ఝులిపించాలని ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం కూడా ఇచ్చారు. అందుకే సరిహద్దుల వద్దే కాకుండా.. రైళ్లు, విమానాల ద్వారా వచ్చే ఇతర రాష్ట్రాల మద్యంపై నిఘా పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణకు నాన్ డ్యూటీ లిక్కర్ ఎక్కువగా హర్యానా, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు గుర్తించారు. ఆయా రాష్ట్రాల్లో తక్కువ ధరకే మద్యం దొరుకుతుండటంతో స్మగ్లర్లు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. ఇటీవల హిస్సార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను తనిఖీ చేయగా.. ట్రెయిన్ అటెండెంట్లే హర్యానా నుంచి భారీగా మద్యాన్ని ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నట్లు తేలింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో తీసుకొచ్చి మేడ్చెల్ ప్రాంతంలోని ఒక గోడౌన్‌లో దాచిన అక్రమ మద్యాన్ని కూడా ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు.

తెలంగాణలో రాష్ట్ర అవసరాల కంటే అధిక మద్యాన్ని ఉత్పత్తి చేయాలంటే 200 నుంచి 250 శాతం వరకు అధిక ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎంత మద్యం ఉత్పత్తి చేసినా పెద్దగా ట్యాక్సులు లేకపోవడంతో అక్కడి నుంచి ఇక్కడికి అక్రమ మద్యం భారీగా తరలిస్తున్నారు.

మరోవైపు ఒడిషా, మహారాష్ట్రలో ఉత్పత్తి అవుతున్న మద్యాన్ని ఫేక్ లేబుల్స్‌తో తెలంగాణకు తీసుకొని రావడాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరుసగా ఎక్పైజ్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సరిహద్దులతో పాటు విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలో భారీగా తనిఖీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు నష్టం తీసుకొని వస్తున్న ఈ అక్రమ మద్యాన్ని వెంటనే కట్టడి చేయాలని అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

First Published:  21 May 2023 5:19 AM GMT
Next Story