Telugu Global
Telangana

ఆ మూడు గుర్తులు లేకపోతే టీఆరెస్ కు మరో 6వేల ఓట్లు!

కారు గుర్తును పోలిన రోటీ మేకర్, రోడ్ రోలర్, చెప్పుల గుర్తుల వల్ల టీఆరెస్ 6 వేల ఓట్లను కోల్పోయినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా ఈ అంశంపై విమర్శలు గుప్పించారు.

ఆ మూడు గుర్తులు లేకపోతే టీఆరెస్ కు మరో 6వేల ఓట్లు!
X

మునుగోడు ఉత్కంట పోరులో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన దాదాపు పది వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. అయితే టీఆరెస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన గుర్తులు మరో మూడు ఉండటం వల్ల మరో 6 వేల ఓట్లు టీఆరెస్ నష్టపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కారు గుర్తును పోలిన రోటీ మేకర్, రోడ్ రోలర్, చెప్పుల గుర్తులను తొలగించాలని టీఆరెస్ మొదటి నుంచి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసినప్పటికీ ఈసీ వాటిని తొలగించలేదు. సమైఖ్యాంధ్ర పరిరక్షణ సమితి(ఇండిపెండెంట్) తరపున పోటీ చేసిన మరమోని శ్రీశైలం యాదవ్ కు రోటీ మేకర్ గుర్తును, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎరుపుల గాలయ్యకు చెప్పుల గుర్తును, శివకుమార్ అనే మరో ఇండిపెండెంట్ కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం గతంలో టీఆరెస్ పిర్యాదు మేరకు రోడ్ రోలర్ గుర్తును తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు తన ఆదేశాలను తానే తుంగలో తొక్కి రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది.

Advertisement

ఈ ఎన్నికల్లో రోటీ మేకర్ గుర్తుకు 2407 ఓట్లు, చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు, రోడ్ రోలర్ గుర్తుకు 1874 ఓట్లు వచ్చాయి. ముగ్గురికి కలిపి 6,551 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లన్నీ టీఆరెస్ కు రావాల్సినవే అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.

ఇదే అంశంపై మాట్లాడిన కేటీఆర్ కూడా ''తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తును మళ్ళీ తామే కేటాయించడం చూస్తే ఈసీ ఎవరి ఆదేశాలతో పని చేస్తుందో తెలియజేస్తుందని మండిపడ్డారు. కారు గుర్తులను పోలిన గుర్తులను ఎవరి ఆదేశాలతోనో బలవంతంగా తీసుకొచ్చి ఇండిపెండె‍ట్ లకు కేటాయించారు? అని ఆయన ప్రశ్నించారు. దాని వల్ల 6 వేల పైచిలుకు ఓట్లు తాము కోల్పోయామన్నారాయన.

Advertisement

ఎన్ని కుట్రలు జరిగినా మునుగోడులో తాము గతంలో కన్నా ఓట్ల శాతం చాలా పెంచుకున్నామని కేటీఆర్ తెలిపారు. 2018 లో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 74,687 ఓట్లు వస్తే ఇప్పుడు 97 వేల ఓట్లు వచ్చాయని, అంటే 23 వేల ఓట్లు ఎక్కువ సాధించామని కేటీఆర్ అన్నారు.

''అదే 2018 లో రాజగోపాల్ రెడ్డి 22 వేల ఓట్లతో గెలిచారు. ఈ రోజు 10 వేల ఓట్లతో ఓడిపోయారు. అంటే 32 వేల ఓట్లు ఆయనకు రివర్స్ అయ్యాయి. ఇది ఆ పార్టీకి చెంప పెట్టు'' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆరెస్ కు 2018 లో 34.29 శాతం ఓట్లు వస్తే ఈ రోజు 43 శాతం ఓట్లు వచ్చాయని, 9 శాతం ఓటింగ్ టీఆరెస్ కు పెరిగిందని కేటీఆర్ అన్నారు.

Next Story