Telugu Global
Telangana

లీకేజీ వ్యవహారంలో ఆధారాలు ఉంటే ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

లీకేజీ వ్యవహారంలో ఆధారాలు ఉంటే ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
X

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో పలు ఆరోపణలు చేసిన వారికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రేవంత్ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఈ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లోతైన విచారణ ప్రారంభించింది. అయితే.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొన్ని నిరాధారణ ఆరోపణలు మంత్రి కేటీఆర్‌పై చేశారు. కేటీఆర్‌కు ఈ లీకేజీకి సంబంధించిన వ్యవహారాలు అన్నీ తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గ్రూప్-1లో వంద మార్కులకు పైగా వచ్చిన వివరాలు అన్నీ బయటపెట్టాలని కూడా రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏకు సంబంధించిన వ్యక్తులకు గ్రూప్స్‌లో 100కు పైగా మార్కులు వచ్చాయని కూడా ఆరోపించారు. అంతే కాకుండా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్... కేటీఆర్ పీఏల ఊర్లు పక్క పక్కనే అని రేవంత్ ఆరోపించారు.

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో మొత్తం నిందను కేటీఆర్‌పై మోపే ప్రయత్నాన్ని రేవంత్ చేశారు. రేవంత్ రెడ్డి ఆరోపణలను సిట్ కూడా సీరియస్‌గా తీసుకున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఉంటే వెంటనే దర్యాప్తు సంస్థకు తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మీకు తెలిసిన వివరాలన్నీ వెంటనే సిట్‌కు తెలియజేయాలంటూ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

కాగా, తనకు ఇంకా సిట్ నోటీసులు అందలేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనకు తెలిసిన విషయాలనే బయటకు చెప్పానని.. ఇందులో బయపడాల్సిన అవసరం లేదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనకు తెలిసిన విషయాలనే చెప్పాను తప్పా... ఇతర విషయాలు తనకు తెలియదని రేవంత్ అన్నారు.

First Published:  20 March 2023 1:03 PM GMT
Next Story