Telugu Global
Telangana

హామీలు ఇస్తే.. వాటిని నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉంది : మంత్రి కేటీఆర్

ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఎకరా భూమి రూ.10 లక్షలకు తక్కువ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇంతలా పెరిగాయని కేటీఆర్ చెప్పారు.

హామీలు ఇస్తే.. వాటిని నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉంది : మంత్రి కేటీఆర్
X

ఎన్నికల్లో గెలవాలనే ఆరాటంతో రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నో హామీలు ఇస్తారు. అయితే ఆ హామీలను తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కేటీఆర్ చెప్పారు. ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తమ గ్రామ పంచాయతీలకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. సర్పంచ్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణలో ఇవ్వాళ ప్రతీ గ్రామంలో భూములు ధరలు పెరిగాయి. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఎకరా భూమి రూ.10 లక్షలకు తక్కువ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇంతలా పెరిగాయని కేటీఆర్ చెప్పారు. భూములు ధరలు పెరగడానికి, ప్రభుత్వానికి ఏం సంబంధం అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే ప్రభుత్వానికి సంబంధం లేకపోతే.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెరగలేదు? ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా పెరగాలి కదా.. ఎందుకు పెరగలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కారణంగానే భూమి విలువ పెరిగిందన్నారు. ప్రతీ రైతు ఇవ్వాళ సగర్వంగా బతుకుతున్నాడు. గుండెల మీద చెయ్యి వేసుకొని.. తన కుటుంబానికి ఒక ఆసరా ఉందని అనుకుంటున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు.

నాకు గ్రామీణ నేపథ్యం గురించి చాలా తక్కువ తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఏడాదిన్నర పని చేశాను. అప్పుడే కాస్త తెలుసుకున్నాను. అయితే సీఎం కేసీఆర్‌కు పల్లెల్లో ఏం కావాలి? పల్లెల్లో ఎలాంటి అవసరాలు ఉన్నాయో బాగా తెలుసు. ఒక సర్పంచ్‌ కంటే ఎక్కువ మన ముఖ్యమంత్రికి తెలుసు. ఎందుకంటే ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. అందుకే పల్లెలను అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

గ్రామాలకు ఏం కావాలో మన కేసీఆర్‌కు తెలిసినంత దేశంలో మరే నాయకుడికి తెలియదని చెప్పారు. కేసీఆర్ తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎన్ఐఆర్‌డీలో శిక్షణకు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం విధులు నిర్వర్తించాలో ఆయన అధ్యయనం చేశారు. కానీ, ఇప్పుడు తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండటం లేదని అన్నారు.

మన దేశంలో ప్రభుత్వం ఐదు అంచెల్లో పని చేస్తుంది. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదని కేటీఆర్ చెప్పారు. ఎంపీటీసీలు గ్రామానికి, మండలానికి మధ్య సమన్వయ కర్తగా ఉండాలి. జెడ్పీటీసీలు మండలానికి, జిల్లా పరిషత్‌కు సమన్వయకర్తలుగా ఉండాలి. ఈ వ్యవస్థలో ఎవరి పాత్ర ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఏ వ్యవస్థ అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతుందని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే అధికార వికేంద్రీకరణ ఆగలేదు. 10 జిల్లాలను 33కు పెంచుకున్నాము. ఇప్పుడు రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు, 12,769 గ్రామాలు ఉన్నాయి. అందుకే సూక్ష్మంగా పని చేసేందుకు వీలు కలుగుతోంది. వికేంద్రీకరణ వల్లే వేగంగా పనులు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని.. 79 జాతీయ అవార్డులను గెలుచుకున్నామని ఆయన చెప్పారు.

First Published:  31 March 2023 11:35 AM GMT
Next Story