Telugu Global
Telangana

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. తొలి ఏడీఆర్ సెంటర్ ఓపెన్ చేయనున్న ఐసీఎస్ఐ

ఐసీఎస్ఐకి తెలంగాణలో 5,500 మంది విద్యార్థులు ఉన్నారని.. వీరిలో 5వేల మంది హైదరాబాద్‌లోనే రిజిస్టర్ అయినట్లు మనీశ్ గుప్తా చెప్పారు.

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. తొలి ఏడీఆర్ సెంటర్ ఓపెన్ చేయనున్న ఐసీఎస్ఐ
X

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ (ఐసీఎస్ఐ) దేశంలోనే తొలి ఆల్టర్నేటీవ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఏడీఆర్) సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నది. ఈ మేరకు ఐసీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు మనీష్ గుప్తా శనివారం విలేకరులకు వెల్లడించారు. కార్పొరేట్ వివాదాల పరిష్కారానికి ఏడీఆర్ సరైన పద్దతి అని మనీశ్ చెప్పారు. ఇలాంటి వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఏడీఆర్ ఇకపై ఒక ఆర్బిట్రేటర్‌గా పని చేస్తుందని అన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఏడీఆర్ అత్యంత త్వరలోనే ప్రారంభం కానున్నదని చెప్పారు. ఇక్కడ అన్ని రకాల మౌళిక వసతులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్‌ను తమ తొలి ఎంపికగా చేసుకున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని ఏడీఆర్ తర్వాత మానేసర్, కోల్‌కతా, ముంబైల్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మాదిరిగా మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంటే.. తర్వాతి దశలో ఆ నగరాలు, పట్టణాలకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు.

ఐసీఎస్ఐకు ఇప్పటికే హైదరాబాద్‌లో రీసెర్చ్ సెంటర్ ఉంది. దేశవ్యాప్తంగా 72 చాప్టర్స్ ఉన్నాయని.. ఇందులో 71,000 మంది సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. అలాగే 2.5 లక్షల మంది రిజిస్టర్డ్ విద్యార్థులు.. 6 ఓవర్సీస్ సెంటర్లు కూడా ఉన్నాయని మనీశ్ వెల్లడించారు. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే, దుబాయ్, సింగపూర్, కెనడాలో ఐసీఎస్ఐ కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు.

ఐసీఎస్ఐకి తెలంగాణలో 5,500 మంది విద్యార్థులు ఉన్నారని.. వీరిలో 5వేల మంది హైదరాబాద్‌లోనే రిజిస్టర్ అయినట్లు చెప్పారు. అలాగే ఇక్కడ 2,600 మంది సభ్యులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఎంతో మందికి సేవలు అందిస్తోందని.. ఏడీఆర్ సెంటర్ ప్రారంభం అయితే దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుందని మనీశ్ గుప్తా తెలిపారు.

First Published:  2 April 2023 2:14 AM GMT
Next Story