Telugu Global
Telangana

57 ఏళ్ల తర్వాత విశాఖలో ఐసీఐడీ సదస్సు.. తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం

కొన్నేళ్లుగా నీటి సంరక్షణలో అపూర్వ విజయాలు నమోదు చేస్తున్న తెలంగాణ తప్పకుండా ఐసీఐడీ కాంగ్రెస్‌లో పాల్గొని, తమ అనుభవాలను వివరించాల్సిందిగా వారు కోరారు.

57 ఏళ్ల తర్వాత విశాఖలో ఐసీఐడీ సదస్సు.. తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం
X

ఏపీలోని విశాఖపట్నంలో ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 8 వరకు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్, డ్రైనేజీ (ఐసీఐడీ) సదస్సును నిర్వహించనున్నారు. 57 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో ఈ సదస్సు జరుగనుండగా.. దానికి వైజాగ్ వేదికగా మారింది. ఐసీఐడీ కాంగ్రెస్‌లో తెలంగాణ తరపున పాల్గొనాలని కోరతూ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్‌కు ఆహ్వానం అందింది.ఈ మేరకు కమిషన్ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, డైరెక్టర్ గిరిధర్ శుక్రవారం స్వయంగా హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఆహ్వానం అందించారు.

కొన్నేళ్లుగా నీటి సంరక్షణలో అపూర్వ విజయాలు నమోదు చేస్తున్న తెలంగాణ తప్పకుండా ఐసీఐడీ కాంగ్రెస్‌లో పాల్గొని, తమ అనుభవాలను వివరించాల్సిందిగా వారు కోరారు. సాగునీటి పారుదలకు సంబంధించి కాళేశ్వరంతో పాటు ఇతర అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వీటిపై ఐసీఐడీలో ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది.

1957లో ప్రధాని నెహ్రూ హయాంలో ఎనిమిది దేశాల సభ్యులతో ప్రారంభమైన ఐసీఐడీ కమిషన్‌లో ప్రస్తుతం 78 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ప్రపంచానికి నీటి భద్రతతో పాటు, పేదరికం, ఆకలి నిర్మూలనే లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ప్రతీ మూడేళ్లకు ఒక సారి నిర్వహించే ఈ కాంగ్రెస్‌కు విశాఖపట్నం వేదికగా నిలుస్తున్నది. కాబట్టి ఈ అరుదైన కార్యక్రమంలో తెలంగాణ తప్పకుండా పాల్గొనాలని జలసౌధలో జరిగిన సమయంలో వారు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఆహ్వానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు.

First Published:  13 May 2023 2:08 AM GMT
Next Story