Telugu Global
Telangana

మీ మధ్యే నేను ఉంటా.. గజ్వేల్ నాయకులకు సీఎం కేసీఆర్ భరోసా

రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించి మరో సారి అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మీ మధ్యే నేను ఉంటా.. గజ్వేల్ నాయకులకు సీఎం కేసీఆర్ భరోసా
X

గజ్వేల్‌ను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాను. ఈ నియోజకవర్గం పరిధిలో ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తన లక్ష్యమని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చెల్ జిల్లా తూంకుంటలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలను గెలబోతోందని చెప్పారు.

రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించి మరో సారి అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి ఆగదని.. మరింత ప్రగతిపథంలో సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజల మధ్యనే నేను ఉంటాను. మూడో సారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి నెల ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గం కోసం కేటాయిస్తానని నాయకులకు భరోసా ఇచ్చారు. మీ మధ్యనే గడుపుతూ అభివృద్ధిని సమీక్షిస్తానని సీఎం చెప్పారు.

కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల కింద భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ గెలిచిన తర్వాత సీఎం హోదాలో ఇదే కన్వెన్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడే పెండింగ్ ప్రాజెక్టులు, పనులకు సంబంధించి విస్తృతంగా చర్చిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో సంతృప్తి చెందవద్దని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.

గజ్వేల్‌లో ఒక విడత మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి. ఇక్కడ రెండో విడత మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గజ్వేల్‌ను వదిలిపెట్టి వెళ్లేది లేదని.. ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అని అన్నారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్య నాయకులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డితో పాటు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

First Published:  20 Oct 2023 12:48 PM GMT
Next Story