Telugu Global
Telangana

అలా అయితే నేను కూడా రాజీనామా చేస్తా .. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత రాబోతున్న మునుగోడు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే తాను కూడా రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించి వెంకట‌రెడ్డి కాంగ్రెస్ నేతల్లో కలవరం సృష్టిస్తున్నాడు.

అలా అయితే నేను కూడా రాజీనామా చేస్తా .. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతాయో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీకి రాజీనామా చేశాక ... త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎపిసోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇవి మొదలయ్యాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీరి మధ్య అద్దంకి దయాకర్ వివాదాల ట్విస్టులు, క్షమాపణలు మునుగోడు ఉపఎన్నికకు ముందే పతాక శీర్షికలకెక్కుతున్నాయి. పార్టీ అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంకా చర్చలు, సమావేశాలు, టికెట్ల కోసం ఆశావహుల పైరవీలు.. ఒకటా? రెండా ? తాజాగా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబు పేల్చారు. అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. మునుగోడు ఎన్నిక సెమీ ఫైనల్ అని, పార్టీల బలాబలాలు ఈ ఎన్నికలో తేలిపోతాయని చెప్పారు. నన్ను సంప్రదించకుండానే కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారు.. ఇక ఉపఎన్నిక విషయం వాళ్ళే చూసుకుంటారు అని కూడా వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తన ప్రమేయమెక్కడిదని అన్నారు.

'మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డుగా పని చేస్తున్నా.. నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఓ సారి మంత్రిగా వర్క్ చేశా.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నా' అని వెరైటీగా ఆయన తన ట్విటర్ హిస్టరీలో 'రాసుకున్నారు'. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా, దయాకర్ సైతం మళ్ళీ రెండోసారి అపాలజీ ప్రకటించినా.. వెంకటరెడ్డి ఇంకా మెట్టు దిగకపోవడం పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. మునుగోడు ఎన్నిక సెమీ ఫైనల్ అని అభివర్ణిస్తున్న వ్యక్తి.. బీజేపీ, టీఆరెస్ పార్టీలతో తాడో, పేడో తేల్చుకోవడానికి సమయం వచ్చిన వేళ.. ఇలా 'అలక పాన్పు' ఎక్కడమేమిటని వీరు వర్రీ అవుతున్నారు. ఈయన కూడా రాజీనామా నినాదం ఎత్తుకున్నారంటే ఇక అది మళ్ళీ మరో పెద్ద వ్యవహారమే అవుతుంది.. ఇప్పటికే రాజగోపాలరెడ్డి రాజీనామాతో పార్టీ పెద్ద దుమారాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఇది ఎటుపోయి ఎటు దారి తీస్తుందోనన్నది కాంగ్రెస్ పార్టీ కలవరం.


First Published:  13 Aug 2022 1:20 PM GMT
Next Story