Telugu Global
Telangana

విముక్తి దివస్‌కు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపాను : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే, కర్ణాటక సీఎం బొమ్మైకు ఆహ్వానాలు పంపినట్లు మంత్రి స్పష్టం చేశారు.

విముక్తి దివస్‌కు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపాను : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచనా ఉత్సవాలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచనా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి సంబంధించిన కళాకారులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 1300 మంది ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే, కర్ణాటక సీఎం బొమ్మైకు ఆహ్వానాలు పంపినట్లు మంత్రి స్పష్టం చేశారు.

పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో సెప్టెంబర్ 17న ముక్తి దివస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. నిజాం రాజధాని హైదరాబాద్‌లో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలిపారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం ఉత్సవాలు చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రంలో కూడా మరాఠ్వాడ ముక్తి దివస్ పేరుతో కాంగ్రెస్ హయాం నుంచే ఉత్సవాలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నిజాం పాలనలో ఉన్న జిల్లాలు 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాతే కర్ణాటక, మహారాష్ట్రలో కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కానీ, నిజాం ఏలిన హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం 1948 సెప్టెంబర్ 17 నుంచి ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించలేదని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సారిగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సారి హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను భీమవరంలో నిర్వహించగా ప్రధాని మోడీ హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ పతాకం రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించామని... ఈ క్రమంలోనే శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

First Published:  16 Sep 2022 1:14 PM GMT
Next Story