Telugu Global
Telangana

వైశాలిని నేను పెళ్లి చేసుకోలేదు.. పోలీసుల ఎదుట ఒప్పుకున్న నవీన్ రెడ్డి

వైశాలిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఫేక్ ఇన్‌స్టా ఐడీ క్రియేట్ చేసి ఫొటోలు అప్‌లోడ్ చేసినట్లు తెలిపాడు.

వైశాలిని నేను పెళ్లి చేసుకోలేదు.. పోలీసుల ఎదుట ఒప్పుకున్న నవీన్ రెడ్డి
X

రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన డెంటల్ స్టూడెంట్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. బీడీఎస్ విద్యార్థిని వైశాలిని తాను గతంలోనే పెళ్లి చేసుకున్నానని చెప్పుకున్న నవీన్ రెడ్డి, అదంతా అబద్దమని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నెల 9న ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వైశాలీ ఇంటిపై తన అనుచరులు, స్నేహితులతో దాడి చేసి వైశాలిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

రాచకొండ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా గుర్తించిన నవీన్ రెడ్డి.. ఆమెను మరో స్నేహితుడి సాయంతో తిరిగి మన్నెగూడలో డ్రాప్ చేశాడు. ఆ తర్వాత పలు ప్రాంతాలు మారుతూ గోవా చేరుకున్న నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నవీన్ రెడ్డికి 8 రోజుల పోలీస్ కస్టడీని ఇబ్రహీంపట్నం కోర్టు మంజూరు చేసింది. విచారణలో గురువారం నవీన్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు. 2021 అగస్టు 4న ఏపీలోని బాపట్ల సమీపంలోని ఓ దేవాలయంలో వైశాలని పెళ్లి చేసుకున్నట్లు గతంలో తెలిపాడు. అంతే కాకుండా దానికి సంబంధించి పలు డాక్యుమెంట్లు చూపించాడు.

విచారణ సందర్భంగా అవన్నీ ఫేక్ అని నవీన్ చెప్పినట్లు తెలుస్తోంది. తాను వైశాలిని ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని ఒప్పుకున్నట్లు సమాచారం. వైశాలిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఫేక్ ఇన్‌స్టా ఐడీ క్రియేట్ చేసి ఫొటోలు అప్‌లోడ్ చేసినట్లు తెలిపాడు. అంతే కాకుండా ఆమె కోసమే వాళ్ల ఇంటి దగ్గర టీ స్టాల్ పెట్టినట్లు కూడా చెప్పాడు. విజయవాడలో సీఏ చదువును మధ్యలోనే ఆపేసి.. ఆ తర్వాత బీకాం పూర్తి చేసినట్లు పోలీసులకు తెలిపాడు.

2020లో మిస్టర్ టీని ప్రారంభించానని.. తనకు 2021లో బొంగలూరులోని ఓ స్పోర్ట్స్ అకాడమీలో వైశాలి పరిచయం అయినట్లు చెప్పాడు. అయితే వైశాలి తన పెళ్లి ప్రతిపాదనకు ఒప్పుకోలేదని.. ఆమె తల్లిదండ్రులను వాళ్ల గ్రామానికి చెందిన సర్పంచ్ సాయంతో కలిసినా తన రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేశారన్నారు. ఆ తర్వాతే వాళ్ల ఇంటి ఎదుటి ఖాళీ స్థలాన్ని నెలకు రూ.30వేలతో లీజు తీసుకొని మిస్టర్ టీ పాయింట్ కోసం గోడౌన్ ఏర్పాటు చేశానని అన్నాడు. తొలి రోజు విచారణ అనంతరం నవీన్ రెడ్డిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, నవీన్ రెడ్డిపై సెప్టెంబర్‌లో ఓ కేసు నమోదైంది. వైశాలి ఇంటి ముందు గణేష్ నిమర్జనం సమయంలో గలాటా సృష్టించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  16 Dec 2022 3:00 AM GMT
Next Story