Telugu Global
Telangana

సాంస్కృతిక సంపద పరిరక్షణకు నడుం భిగించిన తెలంగాణ ప్రభుత్వం

సరికొత్త అందాలు సంతరించుకున్న ఈ బావిని సోమవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పర్యాటకులకు ఇది మరొకి మంచి స్పాట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

సాంస్కృతిక సంపద పరిరక్షణకు నడుం భిగించిన తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక సంపద, వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం నడుం భిగించింది. చారిత్రక నిర్మాణాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏలను సమన్వయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక కట్టడాలను పునరుద్దరిస్తోంది. ఇలా పునరుద్దరించిన గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డిలోని దోమకొండ కోటకు యునెస్కో వారి అవార్డులు కూడా లభించాయి. ఆ ఉత్సహంతో మరిన్ని కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

హైదరాబాద్ బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 300 ఏళ్ల నాటి ఈ మెట్లబావిని ఇటీవలే పునరుద్దరించారు. దాదాపు 8 నెలల పాటు అధికారులు, సిబ్బంది శ్రమించి బావికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. సరికొత్త అందాలు సంతరించుకున్న ఈ బావిని సోమవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పర్యాటకులకు ఇది మరొకి మంచి స్పాట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 మీటర్ల వెడల్పు, 53 అడుగుల లోతైన ఈ బావిని ఒకప్పుడు మంచి నీటి వినియోగం కోసం వాడేవారు. దీనిని నాగన్న కుంట బావి అని కూడా పిలుస్తారు.

సరైన సంరక్షణ లేకపోవడంతో ఈ బావి శిథిలావస్థకు చేరుకున్నది. నలబై ఏళ్లుగా చెత్త చెదారంతో నిండిపోయింది. చుట్టూ చెట్లు పెరిగి నాశనం అయ్యింది. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకొని బన్సీలాల్ పేట మెట్ల బావిని పునరుద్దరించింది. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఈ బావికి పూర్వ వైభవం తీసుకొని వచ్చారు.

ఆర్ట్ గ్యాలరీ, కేఫ్‌గా మారనున్న సర్దార్ మహల్..

చారిత్రక కట్టడాల సంరక్షణలో భాగంగా చార్మినార్‌ సమీపంలో ఉన్న సర్దార్ మహాల్ కూడా కొత్త శోభను సంతరించుకోనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహల్ పునరుద్దరణకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్బన్ డెవలెప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ఈ మహల్‌ను పునరుద్దరించి.. ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ, స్టుడియో, కేఫ్‌‌తో పాటు వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ లాగా దీన్ని తీర్చి దిద్దనున్నారు.

కళాంకృతి ఆర్ట్, తెలంగాణ ప్రభుత్వం, కులీకుతుబ్ షా అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పునరుద్దరణ పనులు జరుగనున్నాయి. 1900లో అప్పటి నిజాం-5 మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన భార్య సర్దార్ బేగం కోసం ఈ భవంతిని నిర్మించారు. పూర్తిగా యూరోపియన్ స్టైల్‌లో అత్యంత అందంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. అయితే తన అభిరుచికి తగినట్లుగా భవంతి లేదని సర్దార్ బేగం ఏనాడూ ఇక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత కూడా ఎవరూ ఈ భవంతివైపు కన్నెత్తి చూడలేదు. కానీ, పేరు మాత్రం సర్దార్ మహల్‌గానే స్థిరపడిపోయింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఈ భవన పునరుద్దరణ పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 30 కోట్ల వ్యయం కానున్నట్లు అంచనాలు వేశారు. సాంస్కృతిక కట్టడమైన ఈ భవనాన్ని పరిరక్షించడమే కాకుండా.. మంచి టూరిస్ట్ స్పాట్‌గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 1965లోనే ఈ భవనం నిజాం వారసుల నుంచి జీహెచ్ఎంసీ (అప్పట్లో ఎంసీహెచ్) చేతికి వచ్చింది. ఆ తర్వాత హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్‌లు ఈ కట్టడాన్ని వారసత్వ సంపదగా ప్రకటించాయి.

First Published:  5 Dec 2022 4:36 AM GMT
Next Story