Telugu Global
Telangana

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మ‌హిళ‌ దారుణహత్య

విక్టోరియాలోని బ‌క్లీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న ఓ చెత్త‌డ‌బ్బాలో చైతన్య మృత‌దేహాన్ని అక్క‌డి పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో చనిపోయింది చైతన్య అని గుర్తించారు.

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మ‌హిళ‌ దారుణహత్య
X

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది. విక్టోరియాలోని బ‌క్లీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఊరి చివర డస్ట్ బిన్ లో మహిళ మృతదేహం గుర్తించిన పోలీసులు.. మృతురాలు చైతన్య మాధగాని అని గుర్తించారు. చైతన్య హత్యకు గురైన విషయం ఆమె భర్తకు తెలియజేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు ఆయన అప్పటికే ఇండియాకు వెళ్లినట్లు తెలియడంతో చైతన్యను ఆమె భర్తే చంపి ఉంటాడా..? అని అనుమానిస్తున్నారు.

విక్టోరియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విక్టోరియాలోని బ‌క్లీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న ఓ చెత్త‌డ‌బ్బాలో చైతన్య మృత‌దేహాన్ని అక్క‌డి పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో చనిపోయింది చైతన్య అని గుర్తించారు. ఇది హత్యేనని, హంతకుడు ఆమెను వేరే చోట చంపి, మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడని చెప్పారు. చైతన్య భర్త అశోక్ రాజ్‌కు సమాచారం అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు. మిర్కావేలోని పాయింట్ కుక్‌లో అశోక్, చైతన్య నివసించే ఇంటికి వెళ్లగా.. ఫ్లాట్ కు తాళం వేసి ఉందని, అశోక్ ఇటీవలే ఇండియా వెళ్లాడని తెలిసిందన్నారు. దీంతో చైతన్య హత్యలో అశోక్ ప్రమేయం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.


మరోవైపు కుమారుడిని తీసుకుని అశోక్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. అత్త‌గారింట్లో కొడుకుని వ‌దిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును ద‌ర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు.. అశోక్ రాజే చైత‌న్య‌ను హ‌త‌మార్చిన‌ట్లు ప్రాథ‌మిక నిర్ధారణకు వచ్చారు. చైత‌న్య, అశోక్‌రాజ్‌ల‌ది పెద్ద‌లు కుదిర్చిన వివాహంగా చెబుతున్నారు. ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న అశోక్‌.. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌ర‌చుగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వివాదాలు జ‌రుగుతున్నాయ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అశోక్ రాజ్‌ను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

First Published:  10 March 2024 11:22 AM GMT
Next Story