Telugu Global
Telangana

ఎంత పని చేశావు తల్లీ..!

కొడుకు పరీక్ష తప్పాడని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ తల్లి.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.

ఎంత పని చేశావు తల్లీ..!
X

ఎంత పని చేశావు తల్లీ..!

పరీక్షలు.. ఫలితాలు. ఇవే ఇప్పుడు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఏ మాత్రం ఒత్తిడికి గురైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం.. వింటున్నాం. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు కూడా అతిగా స్పందించడం.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా.. హైదరాబాద్ మహానగరం జీడిమెట్ల పరిధిలో జరిగిన ఈ సంఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

కొడుకు పరీక్ష తప్పాడని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ తల్లి.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటే పుష్పజ్యోతి, నాగభూషణం దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. వీరిలో ఒకరు సీఏ అర్హత పరీక్ష రాయగా.. ఫెయిల్ అయినట్టు ఫలితం వచ్చింది.

పుష్పజ్యోతి ఆవేదనకు గురై.. తన ఇంట్లోని బెడ్ రూమ్ లో చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. చాలాసేపటి నుంచి పుష్పజ్యోతి కనిపించకపోయేసరికి.. భర్త నాగభూషణం ఇల్లంతా వెతికి చూడగా.. ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్షలు, ఫలితాలే జీవితం కాదన్న వాస్తవాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల ప్రభావం ఇతరులపైనా పడే అవకాశాలు ఉంటాయని.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. పరీక్షల ఫలితాలతో ప్రమేయం లేకుండా వారిని మంచి దారిలో నడిపించాలని సూచిస్తున్నారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా చూడడమే కాకుండా.. తల్లిదండ్రులు కూడా సంయమనంతో ఉంటేనే.. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని స్పష్టం చేస్తున్నారు.

First Published:  10 Aug 2023 5:39 AM GMT
Next Story