Telugu Global
Telangana

మళ్లీ బద్ధకించిన హైదరాబాద్ ఓటర్

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.

మళ్లీ బద్ధకించిన హైదరాబాద్ ఓటర్
X

హైదరాబాద్ ఓటర్ మళ్లీ బద్ధకించాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి, మహేష్ బాబు, చిరంజీవి.. ఇలా హీరోలు, సెలబ్రిటీలంతా కుటుంబ సమేతంగా ఓటు వేసి రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పినా సగటు ఓటరు మాత్రం ఇల్లు దాటి బయటకు రాలేదు. నడవలేని పరిస్థితుల్లో కోట శ్రీనివాసరావు తన ఓటు వేసేందుకు వచ్చారు, మరికొందరు కూడా అలాంటి పరిస్థితుల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు, కానీ సగటు ఓటరుకి ఎందుకో పోలింగ్ అంటే ఆసక్తి లేదు. సోషల్ మీడియాలో పోలింగ్ ట్రెండ్స్ చూస్తూ, ట్వీట్లు వేస్తూ కాలం గడిపిన చాలామంది ఇల్లు దాటేందుకు ఇష్టపడలేదు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ లో పోలింగ్ శాతం 46.08కి పరిమితం అయింది. అంటే సగానికి సగం మంది ఓటర్లు పోలింగ్ బూత్ లకు రాలేదన్నమాట.

కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాగే ట్రోలింగ్ జరిగింది. పోనీ.. లోక్ సభ ఎన్నికలనాటికయినా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకున్నా అదీ జరగలేదు. ఈసారి పోలింగ్ శాతం మరింత తగ్గింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2019 లోక్ సభ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి పోలింగ్ శాతం మెరుగు పడింది. సోమవారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 64.93 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు తుది గణాంకాలు విడుదలైతే ఇది కొంతమేర పెరుగుతుంది.

భువనగిరిలో అత్యథికం..

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఖమ్మం, జహీరాబాద్, మెదక్, నల్గొండలో పోలింగ్ బాగా జరిగింది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో 50.34 శాతం పోలింగ్‌ నమోదైంది. జగిత్యాల మండలంలోని చిన్న కాలువాయి గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా నూరు శాతం అక్కడ ఓటింగ్‌ నమోదు కావడం విశేషం.

First Published:  14 May 2024 12:31 AM GMT
Next Story