Telugu Global
Telangana

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హ‌త్య‌కు మాజీ సీఐ స్కెచ్‌.. - భ‌గ్నం చేసిన పోలీసులు

జైలు నుంచి విడుద‌లైన అనంత‌రం విజ‌య్‌పాల్‌రెడ్డితో 80 ఎక‌రాల భూమి పంప‌కం విష‌యంలో భూమ‌య్యకు వివాదం ఏర్ప‌డింది.

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హ‌త్య‌కు మాజీ సీఐ స్కెచ్‌.. - భ‌గ్నం చేసిన పోలీసులు
X

అత‌నో మాజీ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్.. తాను విధుల్లో ఉండ‌గా న‌క్స‌ల్స్ ఏరివేత‌కు ఇన్‌ఫార్మ‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డిన వ్య‌క్తితో క‌లిసి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అత‌న్ని త‌న బినామీగా వినియోగించుకున్నాడు. ఆ త‌ర్వాత పంప‌కాల్లో తేడా రావ‌డంతో అత‌న్ని హ‌తమార్చేందుకు స్కెచ్ వేశాడు. అయితే అత‌ని కుట్ర‌ను పోలీసులు భ‌గ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు హ‌త్య చేసేందుకు సుపారీ తీసుకున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివ‌ద్ద నుంచి ఒక తుపాకీ, రెండు క‌త్తులు, ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇన్‌ఫార్మ‌ర్‌తో క‌లిసి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం..

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ దీనికి సంబంధించిన వివ‌రాల‌ను సోమ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. సీపీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన దాస‌రి భూమ‌య్య (62) మాజీ సీఐ. తీన్మార్ మ‌ల్ల‌న్న టీమ్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌గా ఉన్నాడు. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు న‌క్స‌లైట్ల ఏరివేత కోసం రంగారెడ్డి జిల్లాకు చెందిన విజ‌య్‌పాల్‌రెడ్డి అనే వ్య‌క్తిని ఇన్‌ఫార్మ‌ర్‌గా ఉప‌యోగించుకున్నాడు. విజ‌య్‌పాల్‌రెడ్డి పోలీసు శాఖ‌కు చేసిన సేవ‌ల‌ను గుర్తించిన ఉన్న‌తాధికారులు ఆ త‌ర్వాత అత‌నికి కానిస్టేబుల్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈలోగా సీఐగా ప్ర‌మోష‌న్ పొందిన భూమ‌య్య‌.. విజ‌య్‌పాల్‌రెడ్డితో క‌లిసి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అత‌న్ని త‌న‌కు బినామీగా వినియోగించుకున్నాడు. ఆ త‌ర్వాత విజ‌య్‌పాల్‌రెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

పంప‌కాల్లో విభేదాలు..

ఆదిలాబాద్‌లో సీఐగా ఉన్న స‌మ‌యంలో భూమయ్య తాండూరులో భూమి కొనుగోలు చేసేందుకు వెళుతూ.. ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. అత‌ని వ‌ద్ద రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన‌ట్టు నిర్ధారించి అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుద‌లైన అనంత‌రం విజ‌య్‌పాల్‌రెడ్డితో 80 ఎక‌రాల భూమి పంప‌కం విష‌యంలో భూమ‌య్యకు వివాదం ఏర్ప‌డింది. త‌న‌ను ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టించ‌డంతో పాటు భూమి పంప‌కంలోనూ ఇబ్బందిపెడుతుండ‌టాన్ని స‌హించ‌లేక‌పోయిన భూమ‌య్య.. అత‌న్ని హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

హ‌త్య‌కు రూ.20 ల‌క్ష‌ల డీల్‌..

ఇందుకోసం జ‌న‌శ‌క్తి ప్ర‌తిఘ‌ట‌న గ్రూపులో ప‌నిచేసిన చంద్ర‌య్య అలియాస్ చందు యాద‌వ్ (47) సాయం కోరాడు. అత‌ను కాజీపేట‌కు చెందిన జి.శంక‌ర్‌, పెద్ద‌ప‌ల్లి జూల‌ప‌ల్లికి చెందిన గ‌డ్డం కుమార్‌ల‌ను సంప్ర‌దించి.. భూమ‌య్య వ‌ద్ద‌కు తీసుకొచ్చాడు. ముగ్గురూ క‌లిసి విజ‌య్‌పాల్‌రెడ్డిని హ‌త‌మార్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. రూ.20 ల‌క్ష‌లు చెల్లించాల‌ని నిర్ణ‌యించ‌గా, అడ్వాన్సుగా రూ.5 ల‌క్ష‌లు తీసుకున్నారు.

3 రోజుల పాటు రెక్కీ..

సికింద్రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో మ‌కాం వేసిన నిందితులు ముగ్గురూ.. విజ‌య్‌పాల్‌రెడ్డి నివాసం వ‌ద్ద మూడు రోజులుగా రెక్కీ వేశారు. ఈలోగా వారి స‌మాచారం అందుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ‌నాథ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో హోట‌ల్‌పై దాడి చేసి నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా వారు భూమ‌య్య పేరు వెల్ల‌డించ‌డంతో సోమ‌వారం భూమ‌య్య‌ను అదుపులోకి తీసుకున్నారు.

First Published:  25 April 2023 5:49 AM GMT
Next Story