ఇవాళ హైదరాబాద్‌లో పోలీస్ టవర్స్ ప్రారంభం.. దీని విశేషాలు తెలుసా?
గురువారం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రారంభం కానున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సామాన్య ప్రజలు కూడా సందర్శించే అవకాశం ఉంది. భారీగా నిర్మించిన ఈ భవంతి 14వ అంతస్తు నుంచి నగరాన్ని చూడటానికి అందరికీ అవకాశం ఉంది.

టెక్నాలజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పడూ ముందుటుందని మరోసారి నిరూపించింది. దేశంలోని ఏ నగరంలో లేనట్లుగా అత్యధిక సీసీ టీవీ కెమెరాలు ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు మరో మైలురాయిని అందుకోబోతుంది. రాష్ట్రంలోని పోలీస్ కెమెరాలతో పాటు.. ఫీడ్ షేర్ చేసుకున్న కెమెరాలు అన్నింటితో అనుసంధానం చేసే ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఆ కెమెరాలన్నింటినీ చూడాలంటే హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10లో అత్యంత ఆధునికంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) ఇవాళ (ఆగస్టు 4) ప్రారంభం కానుంది.
గురువారం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రారంభం కానున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సామాన్య ప్రజలు కూడా సందర్శించే అవకాశం ఉంది. భారీగా నిర్మించిన ఈ భవంతి 14వ అంతస్తు నుంచి నగరాన్ని చూడటానికి అందరికీ అవకాశం ఉంది. అయితే అందుకు ముందుగా అనుమతి తీసుకోవాలి. నగరంలో చార్మినార్, సైబర్ టవర్స్ తర్వాత ఈ కమాండ్ సెంటర్ మరో ఐకాన్‌గా మారుతుందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
ఈ కమాండ్ సెంటర్ నుంచి తెలంగాణలోని ప్రతీ నగరం, పట్టణం, గ్రామంలోని సీసీ కెమెరాలను యాక్సస్ చేసే అవకాశం ఉంది. అప్పటికప్పుడు ఏ ప్రదేశంలో ఏం జరుగుతుందో పోలీసులు గమనిస్తూ.. స్థానిక పోలీసులను అలర్ట్ చేస్తుంటారు. ప్రజల ప్రైవసీకి భంగం కలగకుండా.. తెలంగాణ రక్షణ కోసమే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించినట్లు ఆనంద్ చెప్పారు. ఈ సెంటర్‌కు ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌కు చెందిన 25 మంది అధికారులను డిప్యుటేషన్ కింద తీసుకున్నారు. ఈ సీసీసీ బాధ్యత మొత్తం అడిషనల్ సీపీ చౌహాన్ చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో కేవలం సీసీసీ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు.
ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఇక్కడ నుంచి పనిచేస్తాయి. రాబోయే రోజుల్లో ముఖ్యమైన పోలీసు విభాగాలన్నీ ఇక్కడి నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రజలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా.. ఇక్కడే కంప్లయింట్ చేసేలా సింగిల్ విండో విధానం కూడా అమలు కాబోతోంది.
కేవలం పోలీసింగ్ మాత్రమే కాకుండా.. తెలంగాణ పోలీస్ శాఖ ముఖ్యమైన సమీక్షలు ఇక్కడే నిర్వహించుకునేలా మీటింగ్ ఏరియాను కూడా నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యాధికారులందరూ ఇక్కడికే చేరుకునేలా ప్రత్యేకమైన స్పేస్ క్రియేట్ చేశారు. ఆధునిక సాంకేతికత, కార్పొరేట్ స్థాయి హంగులు ఈ బిల్డింగ్‌లో ఉన్నాయి. ఇక ఈ నిర్మాణంలోని ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కోసం ప్రత్యేకమైన ఛాంబర్లు ఉన్నాయి. అవసరమైన సమయంలో వాళ్లు ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, సిటిజన్ పిటిషన్ మేనేజ్‌మెంట్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ వంటి విషయాలు ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు.