Telugu Global
Telangana

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా ముఠా అరెస్ట్‌.. - రూ.3 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా డీల‌ర్లు, విక్రేత‌ల‌తో సంబంధాలు ఏర్ప‌ర‌చుకున్న వీరు హైద‌రాబాద్‌లోని వివిధ కొరియ‌ర్ సంస్థ‌ల ద్వారా పెద్ద మొత్తంలో సూడో ఎపిడ్రీన్ డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నారు

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా ముఠా అరెస్ట్‌.. - రూ.3 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం
X

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లే ల‌క్ష్యంగా భారీస్థాయిలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు ప్లాన్ చేసిన ముఠాను హైద‌రాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు న‌గ‌రంలోని యువ‌తే ల‌క్ష్యంగా వీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్లాన్ చేశారు. 11 మంది స‌భ్యుల ముఠాలో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.3 కోట్ల విలువైన 3.1 కిలోల సూడో ఎపిడ్రీన్ డ్ర‌గ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 23 సిమ్ కార్డులు, 12 న‌కిలీ ఆధార్ కార్డులు, 6 మొబైల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ చంద‌నా దీప్తి శ‌నివారం ఈ వివ‌రాలు వెల్ల‌డించారు.

చెన్నైకి చెందిన ఖాద‌ర్ మొహిదీన్‌, ఇబ్ర‌హీం షా గ‌త రెండేళ్లుగా అంత‌ర్జాతీయ స్థాయిలో డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా డీల‌ర్లు, విక్రేత‌ల‌తో సంబంధాలు ఏర్ప‌ర‌చుకున్న వీరు హైద‌రాబాద్‌లోని వివిధ కొరియ‌ర్ సంస్థ‌ల ద్వారా పెద్ద మొత్తంలో సూడో ఎపిడ్రీన్ డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. కొంద‌రు కొరియ‌ర్ సంస్థ‌ల నిర్వాహ‌కులను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకొని వారి ద్వారా ఈ డ్ర‌గ్స్‌ను య‌థేచ్ఛ‌గా ర‌వాణా చేస్తున్నారు.

నిఘా సంస్థ‌ల దృష్టి ఎక్కువ‌గా ఉండ‌ద‌నే ఉద్దేశంతో వీరు గాజులు, మ‌హిళ‌ల దుస్తుల ప్యాకింగ్ మ‌ధ్య‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసేవారు. తాజాగా ఖాద‌ర్‌, ఇబ్ర‌హీం షా బేగంపేట‌లోని ఓ కొరియ‌ర్ సంస్థ ద్వారా డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు య‌త్నిస్తున్న‌ట్టుగా పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో నార్కో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఆధ్వ‌ర్యంలో దాడులు నిర్వ‌హించి నిందితుల‌ను అరెస్టు చేశారు.

First Published:  25 Dec 2022 3:04 AM GMT
Next Story