Telugu Global
Telangana

హైదరాబాద్‌లో రోడ్లు బందే.. కానీ వినాయక నిమజ్జనం ఇలా చూడొచ్చు..

ప్రతిష్టాత్మకమైన గణేశ్ శోభ యాత్ర మాత్రం శుక్రవారం నాడు ప్రారంభం కానున్నది. ఖైరతాబాద్‌లోని భారీ వినాయకుడి విగ్రహం నుంచి బాలాపూర్‌లోని గణేషుడి వరకు ఇవ్వాళే నిమజ్జనం చేయనున్నారు.

హైదరాబాద్‌లో రోడ్లు బందే.. కానీ వినాయక నిమజ్జనం ఇలా చూడొచ్చు..
X

హైదరాబాద్ నగరంలో ఇవ్వాళ వినాయక నిమజ్జనం చేస్తున్నారు. గత 9 రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చాలా ప్రాంతాల్లో 7వ రోజుకే తమ ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం పూర్తి చేశారు. అయితే ప్రతిష్టాత్మకమైన గణేశ్ శోభ యాత్ర మాత్రం శుక్రవారం నాడు ప్రారంభం కానున్నది. ఖైరతాబాద్‌లోని భారీ వినాయకుడి విగ్రహం నుంచి బాలాపూర్‌లోని గణేషుడి వరకు ఇవ్వాళే నిమజ్జనం చేయనున్నారు.

గత కొన్ని రోజులుగా వినాయక నిమజ్జనం విషయంలో బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికీ క్రేన్లు ఏర్పాటు చేయలేదని.. వినాయక విగ్రహాలను ప్రగతిభవన్ వద్దకు తీసుకొస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే, హైకోర్టు నిబంధనల ప్రకారమే నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ రోడ్డులో అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోపే పూర్తి అవుతందని స్పష్టం చేశారు.

ఇక హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. దీంతో హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జనం చూడాలని భావించిన చాలా మంది నిరుత్సాహపడ్డారు. వారికి హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. శుక్రవారం రోజు హైదరాబాద్ రోడ్లపై ఆంక్షలు ఉన్న కారణంగా మెట్రో సర్వీసులు ఎక్కువ సేపు నడపనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి అర్థ రాత్రి 2 గంటల వరకు అన్ని లైన్లలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.

గణేశ్ నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం (9 సెప్టెంబర్) రోజు సాధారణంగా ఉదయాన్నే 6 గంటలకే సర్వీసులు మొదలైనా.. చివరి మెట్రో మాత్రం ఆదివారం (సెప్టెంబర్ 10) ఉదయం 2 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. అయితే ఆదివారం ఉదయం 6 నుంచి మెట్రో రైళ్లు యధావిధి షెడ్యూల్‌లో ఆపరేట్ అవుతాయని చెప్పారు.

ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించుకోవాలంటే ఉదయాన్నే సర్వీసు ఉపయోగించుకోవాలని, అలాగే నిమజ్జనం కోసం లక్డీకపూల్, ఖైరతాబాద్, అసెంబ్లీ స్టేషన్ల నుంచి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని మెట్రో యాజమాన్యం కోరింది. చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది.

First Published:  9 Sep 2022 2:01 AM GMT
Next Story