Telugu Global
Telangana

హైదరాబాద్‌లో తొలిసారిగా భూగర్భ మెట్రో : ఎన్వీఎస్ రెడ్డి

శంషాబాద్ వరకు నిర్మించనున్న మెట్రోలో 2.5 కిలోమీటర్ల మేర భూగర్భలైన్ ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో తొలిసారిగా భూగర్భ మెట్రో : ఎన్వీఎస్ రెడ్డి
X

హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం చేరబోతోంది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నో చర్యలు చేపడుతున్నది. దేశంలోనే తొలిసారిగా పీపీపీ పద్దతిలో ఎలివేటెడ్ మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసింది. మూడు మార్గాల్లో ప్రస్తుతం మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఇక త్వరలో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. శంషాబాద్ వరకు నిర్మించనున్న మెట్రోలో 2.5 కిలోమీటర్ల మేర భూగర్భలైన్ ఉంటుందని తెలిపారు. నగరంలోనే ఇది తొలి భూగర్భ లైన్ అని రెడ్డి స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి నానక్‌రామ్ గూడకు చేరుకుంటుందని, అక్కడ నుంచి ఓఆర్ఆర్ పక్కగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోలైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రో కోసం రూ. 6,250 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశామని.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఖర్చును భరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో పూర్తయి ఐదేళ్లు నిండిన‌ సందర్భంగా మంగళవారం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి పలు విషయాలు వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తొలి రోజే 2 లక్షల మంది ప్రయాణించినట్లు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో 31 కోట్ల మంది ప్రయాణం చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందిస్తున్నామని ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. మూడు కారిడార్లలో మరిన్ని సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం రోజుకు 4.40 లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

First Published:  29 Nov 2022 3:12 PM GMT
Next Story