Telugu Global
Telangana

బీఆర్‌ఎస్ మూడో టర్మ్ గెలిచి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ III పూర్తి చేస్తుంది ‍-కేటీఆర్

ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామని, పాతబస్తీలో మెట్రో రైలు మొదటి దశ పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు.

బీఆర్‌ఎస్ మూడో టర్మ్ గెలిచి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ III పూర్తి చేస్తుంది ‍-కేటీఆర్
X

ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మూడో దశను చేపడుతుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫేజ్ III కింద, రామోజీ ఫిల్మ్ సిటీ , నగరంలోని ఇతర ప్రాంతాల వరకు మెట్రో రైలును పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.

ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తామని, పాతబస్తీలో మెట్రో రైలు మొదటి దశ పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌ మెట్రోరైలు విస్తరణను దశలవారీగా ప్రాధాన్యతాంశంగా చేపట్టామని కేటీఆర్ చెప్పారు. మొదటి దశలో మొత్తం 72 కి.మీలకు గాను 69 కి.మీల నిర్మాణం పూర్తయింది. కేంద్రం సహకరించకపోయినా, నిధుల విడుదలలో జాప్యం జరిగినా సరే ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని చెప్పారు.

మొదటి దశ పనుల కోసం కేంద్రం విడుదల చేయాల్సిన‌ రూ.1,458 కోట్ల నుంచి రూ.254 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. రెండో దశ 62 కిలోమీటర్ల మేర రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలిదశ కింద 31 కి.మీ మేర ఎయిర్‌పోర్ట్‌ మెట్రోకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. 6,250 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర నిధులతో చేపడుతున్నారు. ప్రాజెక్టు రెండో దశలో భాగంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 28 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు 5 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు.

“ప్రాజెక్ట్ రెండో దశకు నిధులు కేటాయించాలని కోరుతూ సవివరమైన ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపాం. కానీ స్పందన లేదు'' అని కేటీఆర్ అన్నారు.

పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.500 కోట్లు కేటాయించామని, ఇక్కడ రోడ్డు విస్తరణ, స్థల‌ సేకరణకు సుమారు రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఛార్జీలు పెంచవద్దని హెచ్‌ఎంఆర్ అధికారులను ఇప్పటికే కోరామని ఆయన తెలిపారు.

First Published:  13 Feb 2023 1:40 AM GMT
Next Story