Telugu Global
Telangana

రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ నెంబర్-1

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 1,656 ఎకరాల విస్తీర్ణంలో భూ ఒప్పందాలు కుదిరాయని ఆన్ రాక్ సంస్థ తెలిపింది. ఇందులో హైదరాబాద్ వాటా 769 ఎకరాలు.

రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ నెంబర్-1
X

కరోనా తర్వాత దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కాస్త మందగించింది. స్థలాల రేట్లు తగ్గకపోయినా, కొనుగోళ్లు, అమ్మకాలు నెమ్మదించాయి. కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాలసీతో ఖర్చులు తగ్గించుకున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. అయితే ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది హైదరాబాద్ నగరం. దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నెంబర్-1 స్థానంలో నిలిచింది.

కరోనా తర్వాత వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భారత్ లో తమ కార్యాలయాలకు హైదరాబాద్ అనుకూల ప్రాంతంగా ఎంపిక చేసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ కి డిమాండ్ పెరిగింది. అందులోనూ విస్తరణకు అత్యంత అనుకూలత ఉన్న ప్రాంతం కావడంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ క్రేజ్ పెరిగింది.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన భూమి కొనుగోలు, అభివృద్ధి ఒప్పందాల్లో అత్యథిక శాతం హైదరాబాద్ కేంద్రంగా జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు లెక్క తీస్తే హైదరాబాద్ లో 68 ల్యాండ్ ఒప్పందాలు జరిగాయి. ఇందులో 40 ఒప్పందాలు నివాస సముదాయాలకోసం జరిగినవే కావడం విశేషం. మొత్తంగా 590కి పైగా ఎకరాల్లో రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కోసం ఒప్పందాలు కుదిరాయి. 147 ఎకరాల విస్తీర్ణం కోసం జరిగిన 4 ఒప్పందాలు పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్ లు, గోడౌన్లకోసం జరిగాయి. డేటా సెంటర్లకోసం 4 ఒప్పందాలు కుదిరాయి. 119 ఎకరాల్లో ఈ డేటాసెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అన్నిరకాల అభివృద్ధికోసం 5వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. హైదరాబాద్ తర్వాతి స్థానం బెంగళూరుది. ఇక్కడ 223 ఎకరాలకు సంబంధించి మూడు వేర్వేరు భారీ ఒప్పందాలు కుదిరాయి.

దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్ డెవలప్‌ మెంట్‌ కోసం గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, మహీంద్రా లైఫ్ స్పేస్‌, గౌర్స్ గ్రూప్, బిర్లా ఎస్టేట్స్, హెటెరో గ్రూప్, మైక్రోసాఫ్ట్, మాప్ ట్రీ లాజిస్టిక్స్ సంస్థలు స్థలాల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 1,656 ఎకరాల విస్తీర్ణంలో భూ ఒప్పందాలు కుదిరాయని ఆన్ రాక్ సంస్థ తెలిపింది. ఇందులో హైదరాబాద్ వాటా 769 ఎకరాలు. మిగతా పట్టణాలకంటే హైదరాబాద్ మరింత వేగంగా విస్తరిస్తోంది, అభివృద్ధి చెందుతోంది అనడానికి ఇదే ఉదాహరణ.

First Published:  24 Nov 2022 3:23 AM GMT
Next Story