Telugu Global
Telangana

బావా సాహెబ్ ఇక లేరు..

వసంత్ కుమార్ బావ, అలియాస్ వీకే బావ.హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు సంతకం ఆయన, రాజకీయ ఒత్తిళ్లకు లొంగని మొండితనం ఆయన సొంతం.

బావా సాహెబ్ ఇక లేరు..
X

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ జిల్లాకు పూర్వ కలెక్టర్, చరిత్ర పరిశోధకుడిగా అందరి ప్రశంసలు అందుకున్న వసంత్ కుమార్ బావ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. వయోభారంతోపాటు, కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని స్వగృహంలో వీకే బావ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించారు భార్య అవదేశ్ రాణి.

బావాసాహెబ్..

వసంత్ కుమార్ బావ, అలియాస్ వీకే బావ.. దగ్గరివాళ్లు అందరూ ఆయన్ను బావా సాహెబ్ అంటూ అభిమానంగా పిలుస్తారు. హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు సంతకం ఆయన, రాజకీయ ఒత్తిళ్లకు లొంగని మొండితనం ఆయన సొంతం. అందుకే ఆయన్ను అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి.. రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ గా అప్రాధాన్య పోస్ట్ లోకి బదిలీ చేశారు. ఆ తర్వాతే ఆయన గొప్పతనం మరింతగా వెలుగులోకి వచ్చిందని అంటారు ఆయన సన్నిహితులు. రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పురాతన గ్రంథాలను, పత్రాలను పరిశోధించి పలు రచనలు చేశారు. చరిత్ర పరిశోధకులకు ఆయన ఓ చుక్కానిలా పనిచేశారు.


వీకే బావ స్వస్థలం పంజాబ్‌ లోని ఫిరోజ్‌ పూర్‌. 1954 ఏపీ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన పలు విభాగాల్లో పనిచేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్‌ బహదూర్‌ గౌర్‌ సోదరి అవదేశ్‌ రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టరుగా 1960లలో బాధ్యతలు నిర్వర్తించారు. విశాఖపట్నం పట్టణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హుడా వ్యవస్థాపక వైస్‌ చైర్మన్‌ గా కూడా ఆయన సేవలు అందించారు. 1979లో ఫోర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా హైదరాబాద్ నగరంలోని వారసత్వ కట్టడాలపై అధ్యయనం చేయించారు. 1980లో పదవీ విరమణ తర్వాత పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్ట్టారికల్‌ రీసెర్చి సీనియర్‌ ఫెలోగా కొంతకాలం ఉన్నారు. హైదరాబాద్‌ చరిత్ర అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. డెక్కన్ జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేశారు. ద లాస్ట్ నిజామ్ అనే గ్రంథం హైదరాబాద్ చరిత్ర గురించి ఎన్నో కొత్త విషయాలను మనకు పరిచయం చేస్తుంది. వీకే బావ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

First Published:  10 Jan 2023 5:41 AM GMT
Next Story