Telugu Global
Telangana

హైద‌రాబాద్‌లో `గ్యాంగ్` సినిమా సీన్‌.. - ఐటీ అధికారుల‌మంటూ వ‌చ్చి.. 1700 గ్రాముల బంగారంతో మాయం

బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిని అనుసరించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు.

హైద‌రాబాద్‌లో `గ్యాంగ్` సినిమా సీన్‌.. - ఐటీ అధికారుల‌మంటూ వ‌చ్చి.. 1700 గ్రాముల బంగారంతో మాయం
X

హీరో సూర్య న‌టించిన `గ్యాంగ్‌` సినిమా త‌ర‌హాలో హైద‌రాబాద్‌లో భారీ చోరీ జ‌రిగింది. ఐటీ అధికారుల‌మంటూ వ‌చ్చిన నిందితులు ఏకంగా 1700 గ్రాముల బంగారంతో మాయ‌మ‌య్యారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో శ‌నివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

శ‌నివారం ఉద‌యం ఐదుగురు వ్యక్తులు రద్దీగా ఉండే మోండా మార్కెట్ లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి వచ్చారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ వారిని బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బంది అంద‌రినీ పక్కన కూర్చోబెట్టారు. షాపులో ఉన్న 1700 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని, బంగారం స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో ఉడాయించారు.

ఈ ఘ‌ట‌న‌తో దుకాణ య‌జ‌మాని ఆ ప్రాంతంలోని మిగిలిన బంగారం దుకాణాల య‌జ‌మానుల‌కు ఈ విష‌యాన్ని వివ‌రించాడు. అయితే.. ఐటీ అధికారులు ఇలా వచ్చి తనిఖీలు చేయరని, నోటీసులు ఇస్తారని వారు చెప్పడంతో అనుమానం వచ్చిన దుకాణ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐటీ అధికారులతో మాట్లాడి.. బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ అధికారులుగా తేల్చారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్టు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిని అనుసరించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు.



తెలిసిన వాళ్ల పనే అయ్యుంటుంది.. : డీసీపీ

మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించి ఆరుగురికి ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించామన్నారు. "మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన రివెన్ మధుకర్ బవర్ నాలుగు నెలల క్రితమే మోండా మార్కెట్లో బంగారం షాపు పెట్టుకున్నారు. మధుకర్ సొంతూరు వెళ్లడంతో అతని బావమరిది వికాస్ ఖేదకర్ బాలాజీ గోల్డ్ షాప్‌లో తయారీ పని చూసుకుంటున్నాడు. వికాస్ ఖేదర్ దిల్‌షుఖ్‌న‌గర్ లో మరో గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. చోరీ జరిగిన సమయంలో షాపులో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు.

ఆ సమయంలో వచ్చిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించి కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు) ఎత్తుకెళ్లారు. బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపలే పెట్టి బయట గడియపెట్టారు. బంగారం డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది తెలిసిన వాళ్ల పనేనని భావిస్తున్నాం" అని డీసీపీ తెలిపారు.

First Published:  28 May 2023 2:37 AM GMT
Next Story