Telugu Global
Telangana

ఫ్రెంచ్ శాటిలైట్లను నింగిలోకి పంపనున్న హైదరాబాద్ సంస్థ

ఫ్రాన్స్‌కు చెందిన మూడు సంస్థల శాటిలైట్లను స్కైరూట్ త్వరలో ప్రయోగించనున్న విక్రమ్-1 అనే రాకెట్ ద్వారా పంపనున్నది.

ఫ్రెంచ్ శాటిలైట్లను నింగిలోకి పంపనున్న హైదరాబాద్ సంస్థ
X

భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ వాణిజ్య ప్రయోగాలకు సిద్ధపడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్కైరూట్ ఏరో స్పేస్ అనే సంస్థ గతేడాది విక్రమ్-ఎస్ అనే రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ రాకెట్ లాంఛ్ సక్సెస్ కావడంతో ఇక ఇప్పుడు వాణిజ్యపరంగా రాకెట్లను పంపడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఫ్రాన్స్‌కు చెందిన మూడు సంస్థలతో స్కైరూట్ తాజాగా ఒప్పందం చేసుకున్నది.

ఫ్రాన్స్‌కు చెందిన మూడు సంస్థల శాటిలైట్లను స్కైరూట్ త్వరలో ప్రయోగించనున్న విక్రమ్-1 అనే రాకెట్ ద్వారా పంపనున్నది. భవిష్యత్‌లో చేపట్టబోయే రాకెట్ ప్రయోగాల ద్వారా కూడా ఈ రెండు సంస్థల శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నది. రాబోయే కొన్ని నెలల్లో స్కైరూట్ విక్రమ్-1 అనే రాకెట్ లాంఛ్ చేయనున్నది. దీని ద్వారా ఫ్రెంచ్ ఎర్త్ అబ్జర్వేషన్ సమూహపు ఆపరేటర్ ప్రొమెథీ ఎర్త్ ఇంటిలిజెన్స్‌కు చెందిన శాటిలైట్లను నింగిలోకి పంపనున్నది. భూమికి సంబంధించిన పరిశీలనల కోసం పంపిస్తున్న శాటిలైట్ల సమూహంలో 50 శాతం స్కైరూట్ రాకెట్ల ద్వారానే పంపుతామని ప్రొమెథీ సంస్థ సీఈవో ఆలివర్ తెలిపారు.

ఇక ఫ్రాన్స్‌కు చెందిన ఎక్స్‌ప్లియో, కనెక్ట్‌శాట్ కంపెనీలు కూడా తాము రూపొందించే శాటిలైట్లను విక్రమ్-1 ద్వారా పంపడానికి ఎంవోయూ కుదుర్చుకున్నది. హైదరాబాద్ వచ్చిన ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులు స్కైరూట్ సీఈవో పవన్ చందనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు కంపెనీల ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. దేశంలో ప్రైవేట్ రంగంలో శాటిలైట్లు పంపిస్తున్న తొలి సంస్థగా స్కైరూట్ త్వరలోనే మరో గుర్తింపు తెచ్చుకోనున్నది.


First Published:  11 Oct 2023 3:56 AM GMT
Next Story