Telugu Global
Telangana

టపాసులు పేల్చేందుకు రెండు గంటలే అనుమతి

టపాసులు పేల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం విప‌రీతంగా పెరుగుతోందని.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ క్రాకర్స్ తో పండుగ జరుపుకోవాలని కోరారు.

టపాసులు పేల్చేందుకు రెండు గంటలే అనుమతి
X

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు పండుగకు ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు టపాసుల మోత మోగిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ మోతను పోలీసులు కాస్త క‌ట్ట‌డి చేశారు. దీపావళి పండుగ రోజు రాత్రి రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. దీపావళి నాడు పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే ఎక్కువగా టపాసులు పేలుస్తుంటారు. ఇక హైదరాబాద్‌లో అయితే మరీ అధికం.

పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని టైమ్ లిమిట్‌లోనే టపాసులు కాల్చాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ రెండు గంటలు మినహా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చవద్దని, ముఖ్యంగా శబ్దం అధికంగా వచ్చే టపాసులను పేల్చవద్దని పోలీసులు సూచించారు.

టపాసులు పేల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం విప‌రీతంగా పెరుగుతోందని.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ క్రాకర్స్ తో పండుగ జరుపుకోవాలని కోరారు. జారీ చేసిన ఉత్తర్వులు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. పోలీసుల ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First Published:  10 Nov 2023 3:33 PM GMT
Next Story