Telugu Global
Telangana

హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్: టిక్కట్ల అమ్మకంలో గందరగోళం, ఫ్యాన్స్ ఆందోళన‌

ఈ నెల 25 న హైదరాబాద్ లో జరగునున్న భారత్, ఆస్ట్రేలియా ల క్రికెట్ మ్యాచ్ టిక్కట్ల విక్రయం వ్యవహారం గందరగోళంగా తయారయ్యింది. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్స్ లో క్యూలైన్లో నిలబడుతున్న క్రికెట్ ఫ్యాన్స్ ఉత్త చేతులతో వెనుతిరిగాల్సి వస్తోంది.

హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్: టిక్కట్ల అమ్మకంలో గందరగోళం, ఫ్యాన్స్ ఆందోళన‌
X

మూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో ఇంటర్ నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా ల మధ్య మూడో T20 ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.

గత మూడు సంవత్సరాలుగా టాప్-క్లాస్ క్రికెట్ లేకపోవడంతో, జంట నగరాల అభిమానులు ఈ టాప్ జట్ల మధ్య పోరును చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే టికెట్ల‌ విషయంలో గందరగోళం తలెత్తడంతో వారి ఉత్కంఠ నిరాశగా మారింది.

ఆన్ లైన్ టిక్కట్లను పేటీఎమ్ అమ్ముతోంది. అయితే అందులో టిక్కట్ బుక్ చేసుకోవడం ఎవరికైనా సాధ్యమైందా అనేది అనుమానమే. సెప్టంబర్ 15న ఆన్ లైన్ టిక్కట్ల బుక్కింగ్ అయిపోయిందని పేటీఎం ప్రకటించింది. ఇక మిగిలింది ఆఫ్ లైన్ టిక్కట్లు. ఆ టిక్కట్ల కోసం క్రికెట్ అభిమానులు, ఉప్పల్ గ్రౌండ్, జింఖానా గ్రౌండ్ చుట్టూ తిరిగుతున్నారు కానీ ఎప్పుడు అమ్మకాలు మొదలుపెడతారన్నది ఇదిమిద్దమైన సమాచారం లేదు.

జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు గత మూడు రోజులుగా పడిగాపులుపడుతున్నారు. పెద్ద పెద్ద క్యూ లైన్లలో గంటల‌ తరబడి వేచి ఉంటున్నారు. కానీ టిక్కట్ల అమ్మకం మాత్రం జరగడం లేదు. ఈ రోజు ఉదయం 5 గంటల నుండే ఫ్యాన్స్ అక్కడ క్యూలో నిలబడ్డారు. గంట గంటకు రద్దీ పెరుగుతూనే ఉంది.

వేలాది సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గరకు వచ్చారు. గేట్లకు తాళం వేయడంతో పాటు టిక్కెట్లు విక్రయించడం లేదని అక్కడి అధికారులు చెప్పడంతో వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అప్పటికే గంటల కొద్దీ నిరీక్షించిన యువకులు గేట్లు తోసుకొని, గోడలు దూకి జింఖానా క్రికెట్ మైదానంలోకి వచ్చారు. అక్కడి హెచ్సీఏ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. నాలుగైదు రోజులుగా తిరుగుతున్నా టిక్కెట్లు అమ్మడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పేటీఎం' యాప్ లో టిక్కెట్లు అందుబాటులో లేవని, ఉన్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా నేరుగా కౌంటర్లలో ఎందుకు అమ్మడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు.

టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. వీ వాంట్ టిక్కెట్స్.. హెచ్ సీఏ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ మైదానంలోకి వచ్చారు. హెచ్సీఏ కార్యాలయం పైకి కూడా ఎక్కారు. వేలాది మంది అభిమానులు గ్రౌండ్ లోపలికి చొచ్చుకు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. కొంత మంది అభిమానులు జింఖానా క్రికెట్ గ్రౌండ్, ఔట్ ఫీల్డ్, పిచ్ పై కూర్చున్నారు. టిక్కెట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని చెదరగొట్టడానికి పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నారు.

ఇంత జరుగుతున్నా అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "టిక్కట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసినప్పటి నుండి నేను టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆన్‌లైన్‌లో ఒక్క టిక్కట్ కూడా కొనలేకపోయాను. ఆన్‌లైన్ లో టిక్కెట్లు అందుబాటులో లేవు. దాంతో ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఇక్కడకు వచ్చాను. టిక్కెట్ల విక్రయం ఇంకా ప్రారంభం కాలేదన్నారు. వాటిని ఎప్పుడు విక్రయిస్తారో తెలియజేయడానికి ఇక్కడ నోటీస్ బోర్డు కానీ వివరాలు చెప్పడానికి మనుషులు కానీ ఎవరూ లేరు'' అని ఐటీ ఉద్యోగి కిరణ్ అన్నారు.

అయితే ఆన్ లైన్ లో టిక్కట్లు కొన్న వారు కూడా మళ్ళీ దాన్ని చూపించి ఆఫ్ లైన్ లో టిక్కట్ తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు ఇస్తారో సమాచారం లేదు.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకున్న‌ ఐటీ ఉద్యోగి ప్రసాద్ తన ఆన్‌లైన్ టిక్కెట్‌ను రీడీమ్ చేసుకోవడానికి క్యూలో ఉన్నారు. "నేను చాలా కష్టాల తర్వాత టిక్కెట్లు కొన్నాను. జింఖానాలో టిక్కెట్‌ని రీడీమ్ చేసుకోవచ్చని వాట్సాప్ గ్రూప్‌లోని స్నేహితుల నుండి నాకు సందేశం వచ్చింది. దాంతో నేను నిన్న (మంగళవారం) ఇక్కడికి వచ్చి ఉత్త చేతులతో రిటర్న్ వెళ్ళాను. మళ్ళీ ఈ రోజు వచ్చాను. కానీ మాకు ఇంకా టిక్కెట్లు ఇవ్వలేదు. వారు టిక్కెట్లను ఎప్పుడు రీడీమ్ చేస్తారనే దానిపై స్పష్టత కానీ సమాచారం కానీలేదు, "అని ఆయన మండిపడ్డారు.

అయితే జింఖానాలో ఆఫ్‌లైన్ టిక్కెట్ విక్రయం గురువారం ప్రారంభమవుతుందని HCA అధికారులు చెప్తున్నారు. ఆన్‌లైన్ టిక్కెట్‌లను కూడా రేపే రీడీమ్ చేసుకోవచ్చని వారు తెలియజేశారు.

"టికెట్ విక్రయ ప్రక్రియ మొత్తాన్ని పే టీఎం నిర్వహిస్తోంది. ఎప్పుడు టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుందో త్వరలోనే ప్రకటిస్తాం. బహుషా గురువారం నుండి టిక్కెట్లను విక్రయించవచ్చు"అని HCA అధికారి ఒకరు వెల్లడించారు.

అయితే పే టీఎం వెబ్‌సైట్‌లో టిక్కెట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయనే సమాచారాన్ని పోస్ట్ చేసింది. "మేము సెప్టెంబర్ 15న ఆన్‌లైన్ ఇన్వెంటరీ కోటాను దాదాపుగా ముగించాము. దయచేసి తదుపరి అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి. లాట్ 2లో పరిమిత టిక్కెట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయి, "అని వెబ్‌సైట్ పేర్కొంది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు జింఖానాలో టిక్కెట్లను రీడీమ్ చేసుకోవచ్చని కూడా తెలిపింది.

ఇంకా నాలుగురోజుల్లో మ్యాచ్ పెట్టుకొని ఇంకా టిక్కట్ల విషయంలో ఇంత గందరగోళం ఉండటం పట్ల క్రికెట్ ప్రియులు మండిపడుతున్నారు. ఎక్కువ శాతం టిక్కట్లు బ్లాక్ అయిపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అభిమానులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ డిపార్ట్ మెంట్ల నుంచి టిక్కట్ల కోసం హెచ్ సీ ఏ కు కు ఇండెంట్లు వచ్చినట్టు సమాచారం. ఒక్క పోలీసు డిపార్ట్ మెంట్ నుంచే 4 వేల టిక్కట్ల కోసం ఇండెంట్ వచ్చినట్టు ఎన్ టీవీ వెల్లడించింది.


First Published:  21 Sep 2022 8:29 AM GMT
Next Story